ఒక్కసారిగా పెరిగిన ధరలు
ధరలు ఇలా..
భూపాలపల్లి అర్బన్: అసలే ఉరుకులు పరుగుల జీవితం. ఒక్కోసారి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) కాకపోతే చిరు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువగా చిన్న చిన్న టిఫిన్ సెంటర్లకు వెళ్లి తింటుంటారు. మొన్నటి వరకు ప్లేట్ పూరీ, ఇడ్లీ, వడ, దోశకు రూ.30 నుంచి రూ.40వరకు ఉండగా.. వాటి ధరలు అమాంతం పెంచారు. ఏకంగా రూ.50 నుంచి రూ.70వరకు పెంచడంతో సామాన్యులు తినలేని పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు సక్రమంగా రాకపోవడం.. ఇటీవల కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచడంతో చిరువ్యాపారులకు గుదిబండగా మారింది. చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్దపెద్ద బిర్యానీ సెంటర్లు కూడా కట్టెల పొయ్యినే వినియోగిస్తున్నారు. అటు టిఫిన్స్. ఇటు మీల్స్ సెక్షన్‌లో ఒకేసారి రేట్లు పెంచారు. ఇది సామాన్య, మధ్యతరగతి వారికి ఇబ్బందిగా మారింది. చిరు హోటళ్లకు గుదిబండగా మారింది.
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, గప్‌చుప్ బండ్లు, చిన్నచిన్న హోటళ్లు, బిర్యానీ సెంటర్లు కమర్షియల్ సిలిండర్ల పైనే ఆధారపడుతుంటారు. సాయంత్రం, మధ్యాహ్నం వేళ రోడ్లపై టిఫిన్స్ విక్రయిస్తుంటారు. ఇది సామన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సిలిండర్ల ధర పెంచడంతో విధిలేని పరిస్థితుల్లో టిఫిన్స్ ధర పెంచారు. ఒక హోటల్‌కు నెలకు 4–5 వాణిజ్య సిలిండర్లు అవసరం ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సిలిండర్ల ధర పెంచడంతో రూ.5వేల నుంచి రూ.6వేల భారం పడుతోందని, అందుకే విధిలేని పరిస్థితుల్లో టిఫిన్ ధరలు పెంచాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు ఇంటి అద్దెలు, సిబ్బంది వేతనాలు, నిత్యావసర కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వ్యాపారం సరిగా సాగడం లేదని, జీవనం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా చిన్న హోటల్‌కు వెళ్లి పూరీ, దోశగాని తింటే రూ.30నుంచి రూ.40 ఉండేది. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80కు పెరిగింది. ఈ ధర దాదాపు అన్నంతో కూడిన భోజనం వస్తుంది. అలా ఒక్కసారిగా రేట్లు పెంచడంతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. సామాన్య కుటుంబాలకు ఇది భారంగా మారింది. హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిని వాడటంతో ఖర్చు అధికంగా అవుతుందని, దీంతో విధిలేని పరిస్థితుల్లో రేట్లు పెంచామని చెబుతున్నప్పటికీ అంతిమభారం కష్టమర్లపైనే పడుతోంది.
సామాన్యులు తినలేని పరిస్థితి
భారీగా పెరిగిన సిలిండర్ రేట్
హోటల్ యజమానులపైనా
ఆర్థిక భారం
ఇడ్లీ రూ.50
వడ రూ.50
మసాల దోశ రూ.70
రవ్వ దోశ రూ.80
పూరీ రూ.60
జిల్లాకేంద్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అప్పటివరకు ఇంట్లో టిఫిన్ చేయకపోవడంతో అంబేడ్కర్ సెంటర్ సమీపంలోని ఓ హోటల్‌కు వెళ్లి దోశ ఆర్డర్ ఇచ్చాడు. దానికి హోటల్ నిర్వాహకుడు రూ.70 బిల్లు వేశాడు. దీంతో అవాక్కయిన సదరు ఉపాధ్యాయుడు.. ఒక్క దోశకే ఇంతనా..? అని ప్రశ్నించగా.. ధరలు పెరిగాయని, సిలిండర్ల కొరత ఉందని, అందుకే రేట్లు పెంచాల్సి వచ్చిందని నిర్వాహకుడు జవాబిచ్చాడు.


