ఏటూరునాగారం: మండల పరిధిలోని రామన్నగూడెంలోని పుష్కరఘాట్‌కు అనుకొని 800 మీటర్ల మేర కరకట్ట మట్టి గోదావరి వరదలతో ఒర్లిపోయింది. రివిట్‌మెంట్‌కు వేసిన రాళ్లు సైతం కొట్టుకుపోయి గోదావరిలో కలిశాయి. గోదావరి కరకట్ట ఆనుకొని ఉన్న ఒడ్డు మొత్తం ఒర్లిపోతుండడంతో కరకట్ట ప్రమాద స్థాయికి చేరింది. గతంలో మంజూరైన జియో ట్యూబ్స్ పనులు పుష్కరఘాట్ నుంచి 800 మీటర్ల దూరంలో కరకట్ట కోతకు గురైన ప్రాంతం ఉంది. ముందుగా ప్రమాద స్థాయిలో కోతకు గురై ఉన్న ప్రాంతంలో 150 మీటర్ల మేర తొలి దశగా జియోట్యూబ్స్ పనులను రూ. 65 లక్షలతో చేపట్టారు. ఇప్పటి వరకు 125 మీటర్ల వరకు పూర్తి అయ్యింది. ఇంకా 25 మీటర్ల కోసం ఇసుక ఫిల్లింగ్ పనులు చేపడుతున్నారు. అదే విధంగా మళ్లీ ఇక్కడి నుంచి 650 మీటర్ల దూరంలో ఉన్న పుష్కరఘాట్ వరకు కూడా ఈ జియో ట్యూబ్స్‌ను వేస్తూ కరకట్టను మరింత పటిష్టపర్చాలని ఇరిగేషన్‌శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. భారీ నీటి పారుదలశాఖ అధికారులు నుంచి 650 మీటర్ల పుష్కరఘాట్ వరకు ఉన్న కరకట్ట ఒర్లిపోకుండా జియోట్యూబ్స్ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.5.60 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ఇంజనీరింగ్ చీఫ్‌కు పంపించారు.
పుష్కరాల కోసం..
వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో కరకట్టను పటిష్టపర్చనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పలు దఫాల వరదలకు కరకట్ట మట్టి కొట్టుకపోవడంతోపాటు ఘాట్‌లోని మెట్లు మొత్తం కొట్టుకుపోయాయి. ఈ ఏడాది వచ్చే గోదావరి వరదకు కరకట్ట మట్టి, మెట్లు సైతం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రతిపాదనలను సిద్ధం చేసి ఇక్కడ కూడా ట్యూబ్స్‌ను అమర్చాలని డిసెంబర్‌లో సర్వే చేపట్టారు. పనులపై వేగాన్ని పెంచాలనే ఉద్దేశంతో గోదావరిలో ఆయిల్ ఇంజిన్‌లను ఏర్పాటు చేసి ఇసుక ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. ఇసుకను నింపిన తర్వాత టెక్స్‌టైల్ క్లాత్ వేసి ఆ తర్వాత జియోట్యూబ్స్‌ను వాటిపై అమర్చి అందులో ఇసుక, నీటిని నింపి ఎటు కదలకుండా కరకట్టకు రక్షణ ఇచ్చే విధంగా అమర్చనున్నారు. గోదావరి ఇప్పటి వరకు పూర్తి అయిన 125 మీటర్లు, ఇప్పుడు పనులు జరుగుతున్న 25 మీటర్లతో పాటు 650 మీటర్లు అదనంగా జియోట్యూబ్స్‌కు నిధులు మంజూరు అయితే అస్సాంకు చెందిన కాంట్రాక్టర్ ద్వారా ఈ పనులను పూర్తి చేయించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
పుష్కరఘాట్‌ను ఆనుకుని 850 మీటర్లు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు
వచ్చే ఏడాది పుష్కరాల కోసం
ముందస్తుగా చర్యలు
భారీ నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో పనులు


