భూముల విలువ పెంపు | - | Sakshi
Sakshi News home page

భూముల విలువ పెంపు

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

నాలుగేళ్ల తర్వాత పెంచుతున్న ప్రభుత్వం

కమర్షియల్‌, నాన్‌ కమర్షియల్‌

ప్రాంతాల వారీగా పెంపు

ప్రాంతాన్ని బట్టి 50 శాతం నుంచి

100 శాతం పెరిగే అవకాశం

త్వరలో కొత్త చార్జీలు అమలయ్యే

అవకాశం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో భూముల విలువ భారీగా పెరగనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో భూములకు ఉన్న ధర, ప్రభుత్వ విలువకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భూముల విలువ పెంచాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగా జిల్లాలో కమర్షియల్‌, నాన్‌ కమర్షియల్‌ ప్రాంతాల వారీగా ఉన్న భూముల విలువలను పరిగణనలోకి తీసుకుని ఆయాచోట్ల ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఎంత ధరలు ఉన్నాయి, ఎంత పెంచితే బాగుంటుందనే దానిపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖ కసరత్తు చేస్తోంది.

గతంలో 30 నుంచి 50 శాతం వరకు..

ప్రభుత్వం 2022 జనవరిలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రాంతాన్ని బట్టి గతంలో 30శాతం నుంచి 50శాతం వరకు పెంచింది. అప్పట్లో పెంచిన భూ విలువలను అదే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం భూ విలువ పెంపుపై పది రోజులుగా కసరత్తు చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో భూముల విలువ అధికంగా ఉన్న ప్రాంతాల్లో రేట్లు పెంచేందుకు సిద్ధమైంది.

మరో రెండు రోజుల్లో ఫైనల్‌

ప్రభుత్వం భూముల విలువను మరో రెండు రోజుల్లో ఫైనల్‌ చేసి ప్రకటించే అవకాశం ఉంది. దానికి సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భూముల విలువ పెంపునకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది. దాన్ని రాష్ట్ర స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖకు పంపారు. వారు పంపినా అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ధరల ఆధారంగా భూముల విలువను పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి పెంచిన ధరలు రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 28 లేదా జూన్‌ 1వ తేదీ నుంచి పెంచే అవకాశాలు ఉన్నాయి.

జిల్లా కేంద్రంలో భారీగా

పెరిగే అవకాశాలు

జిల్లా కేంద్రంలోని మంజూర్‌నగర్‌, పుల్లూరిరామయ్యపల్లి, కుందురుపల్లి తదితర ప్రాంతాల్లో కమర్షియల్‌, నాన్‌ కమర్షియల్‌కు సంబంధించిన భూముల విలువలు ప్రస్తుతం గజం రూ.2100 ఉంటే, దానిని రూ.3500కు పెంచే అవకాశం ఉంది. కాటారం, గణపురం మండలాల్లో సైతం భూముల ధరలు అధికంగా ఉన్నాయి. అక్కడ సైతం జిల్లా కేంద్రంతో సమానంగా భూముల ధరలు పెరుగుతున్నట్లు తెలిసింది.

50శాతం నుంచి 100శాతం వరకు..

ప్రభుత్వం ప్రాంతాన్ని బట్టి ప్రస్తుతం 50 శాతం నుంచి 100 శాతం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో 50 శాతంలోపే పెంచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికంగా భూముల విలువ పెంచినా రిజిస్ట్రేషన్లు తగ్గి ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజల కొనుగోళ్ల సామర్థ్యం మందగిస్తుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా జిల్లాకేంద్రంతో మండలకేంద్రాల్లో భూముల విలువలు బహిరంగ మార్కెట్‌లో ఎంత మేరకు పెరిగాయన్న వివరాలను అధికారులు సేకరించి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. జిల్లాకేంద్రంతో పలు మండలాల్లో ప్రధాన ప్రాంతాల్లో మాత్రం 100 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement