గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.
రోడ్డెక్కి రైతుల నిరసన
మల్హర్(కాటారం): ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు రోడ్డెక్కారు. ఽమండలంలోని కాటారం ప్రధాన రోడ్డుపై ధాన్యం బస్తాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాటారం–మంథని ప్రధాన రహదారిపై గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 30 రోజులు గడిస్తున్నా లారీలు రావడం లేదని కారణంతో ధాన్యం సేకరణ జరగడం లేదని వాపోయారు. అకాల వర్షాలు కురిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. పనులు వదులుకోని ధాన్యం అమ్ముకోవడానికి కల్లాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు.
ముగిసిన వేసవి
క్రీడా శిక్షణ శిబిరం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల పిల్లల కోసం వర్కర్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25 రోజులుగా ఉచితంగా నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. కృష్ణకాలనీలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఓర్పు వంటి మంచి లక్షణాలు పెంపొందుతాయన్నారు. సింగరేణి సంస్థ ప్రతీ సంవత్సరం కార్మికుల పిల్లల కోసం వేసవి క్రీడా శిబిరాలను నిర్వహిస్తూ వారి ప్రతిభను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మధుకర్‌రెడ్డి, సీఎంఏఓఐ ప్రతినిధి నజీర్, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్‌కుమార్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, జనరల్ క్యాప్టెన్ మేడ మల్లేశ్ పాల్గొన్నారు.
భక్తులకు మజ్జిగ పంపిణీ
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో అంత్య పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రామప్పకు తరలివస్తున్న భక్తులకు సోమవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కాళేశ్వరంలో జరుగుతున్న అంత్య పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రామప్పను సందర్శించే భక్తులకు విజయవాడ పట్టణానికి చెందిన కోనేటి ఏడుకొండలు – దుర్గశ్రీలక్ష్మి దంపతులు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వేసవిలో భక్తులు వడదెబ్బకు గురికాకుండా మజ్జిగ కొంతమేర ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్, ఆలయ సిబ్బంది సంతోష్, దామోదర్, రత్న కుమారి, టూరిస్ట్ గైడ్ విజయ్ కుమార్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, అరుణ్, పురావస్తు శాఖ, గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు.


