అంగన్‌వాడీ కేంద్రాల్లో సమతుల్యమైన ఆహారం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాల్లో సమతుల్యమైన ఆహారం

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి రూరల్‌: ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు సమతుల్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించి బాల్యాన్ని బలోపేతం చేయడం అంగన్‌వాడీ కేంద్రాల లక్ష్యమని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు నిర్వహించారు. ‘సే నో టు జంక్‌ ఫుడ్‌’ నినాదంతో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఫుడ్‌స్టాల్‌ను కలెక్టర్‌ సందర్శించారు. వంటకాల తయారీ విధానం, పోషక ప్రయోజనాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన, సమతుల్య ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందన్నారు. మార్కెట్లో లభించే జంక్‌ ఫుడ్‌ను చిన్నపిల్లలకు ఇవ్వకుండా, స్థానికంగా అందుబాటులో ఉన్న తాజా కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు వంటి పోషకాహారాన్ని అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందించాలి

జిల్లాలోని నాలుగు బ్లాక్‌లలో 31 ఆది సేవాకేంద్రాలు ఉన్న గ్రామాల్లో అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులకు సూచించారు. గిరిజన కుటుంబంలో ప్రతీ ఒక్కరికి సికిల్‌ సెల్‌ ప్రాబ్లం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్‌, జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీహరి, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

భూపాలపల్లి: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 40 దరఖాస్తులను కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజలకు సమయపాలనతో కూడిన సేవలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు. ప్రజావాణికి వచ్చిన ప్రతీ దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించాలని, ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు వెంటనే ఎండార్స్మెంట్‌ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తును తప్పనిసరిగా ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని చెప్పారు. దరఖాస్తుదారుడికి తప్పకుండా రశీదు అందజేయాలన్నారు. దీని ద్వారా సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహించినా, కాలయాపన చేసినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement