● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
మల్హర్(కాటారం): ప్రమాదవశాత్తు కారు చెట్టును ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం నుంచి ధర్మసాగర్ వైపు కారు వెళ్తుంది. ఈ క్రమంలో గుమ్మళ్లపల్లి శివారులో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది, ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న శ్రావణ్(22) మృతిచెందగా.. శశివరణ్, రాజుకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని వృద్ధుడు..
గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డిపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన బొక్కల ఐలయ్య (75) అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన బొక్కల ఐలయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం తెల్లవారుజామున కాలినడకన జాతీయ రహదారిపైకి వెళ్లాడు. పరకాల నుంచి భూపాలపల్లి వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఐలయ్యను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మేడారం దర్శనానికి వెళ్లి వస్తూ..
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి వెళొస్తూ కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో కారులోని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. నార్లాపూర్ ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాలకు గ్రామానికి చెందిన మచ్చిక సాయికుమార్ ఈ నెల 24న సమ్మక్క– సారలమ్మల దర్శనానికి మేడారానికి వచ్చారు. మొక్కుల అనంతరం తిరుగు ప్రయాణంలో మేడారం– తాడ్వాయి మార్గ మధ్యలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈఘటనలో మచ్చిక సాయికుమార్(25)కు తీవ్ర గాయాలు కావడంతో అస్పత్రికి తరలిస్తున్న క్రమంలో పరిస్ధితి విషమించి మృతి చెందాడు.


