ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట ఇప్పపువ్వు లడ్డూలు విక్రయిస్తున్నారు. కన్నాయిగూడెం మండలం రాజన్నపేటకు చెందిన గిరిజన ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేసి ఒక బాక్స్‌లో పెట్టి రూ.100 చొప్పున ఐటీడీఏకు వచ్చి వెళ్లే వారికి విక్రయిస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ మహిళా సంఘం సభ్యులు ఇప్ప పువ్వును సేకరించి వాటితో స్వచ్ఛమైన బెల్లంతో లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ లడ్డూలతో అనేక పోషకాలు అందుతాయని వివరిస్తూ విక్రయిస్తున్నారు. దీంతో పలువురు లడ్డూలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
5 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మల్హర్: అనుమతులు లేకుండా తాడిచర్ల మానేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సోమవారం కొయ్యూరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిచర్ల మానేరు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా లోడ్ చేసుకొని తరలిస్తుండగా తాడిచర్ల సెంటర్‌లో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై–2 రజన్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


