భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా 326మందికి 108 అంబులెన్స్ సేవల ద్వారా తరలించినట్లు 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తెలిపారు. రోగులకు అంబులెన్స్‌లోనే ప్రీ–హాస్పిటల్ ట్రీట్మెంట్ అందిస్తూ సమీప ఆస్పత్రులకు సురక్షితంగా తరలిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వడదెబ్బకు గురవుతున్నారని వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది సమర్థవంతంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలు, ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు తీవ్రమైన ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అరటి తోట దగ్ధం
టేకుమట్ల: పంట వ్యర్థాలకు పెట్టిన నిప్పుతో చెలరేగిన మంటలు అంటుకుని అరటి తోట దగ్ధమైన ఘటన మండలంలోని పంగిడిపల్లిలో చోటుచేసుకుంది. బాధిత రైతు పారిపెల్లి మహేందర్ కథనం ప్రకారం.. తనకున్న ఎకరన్నర వ్యవసాయ భూమిలో అరటితోట సాగు చేశాడు. రెండు రోజుల్లో అరటి గెలలను కోసేందుకు సిద్ధమయ్యాడు. ఈ తరుణంలో పరిసర ప్రాంత రైతులు పంట వ్యర్థాలకు అంటించిన నిప్పుతో మంటలు చెలరేగి అరటి తోట మొత్తం దగ్ధమైంది. అరటి తోటపై పెట్టుకున్న ఆశలు అగ్ని రూపంలో ఆవిరయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పూర్తిగా దగ్ధమైందని.. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
పామాయిల్ తోట దగ్ధం
భూపాలపల్లి రూరల్: అగ్ని ప్రమాదంలో పామాయిల్‌తోట దగ్ధమైన ఘటన భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకొంది. గొర్లవీడు గ్రామానికి చెందిన చెలిమెల రాజయ్యకు చెందిన సుమారు రెండెకరాల పామాయిల్, సుబాబు తోట అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో విద్యుత్ మోటర్ వైర్లు, డ్రిప్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
మూడు ఇసుక ట్రాక్టర్ల
పట్టివేత
చిట్యాల: అనుమతులు లేకుండా మండలంలోని కాల్వపల్లి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులు అంబాల రాంబాబు, బొందుగుల కుమార్, నాగవత్ రవీందర్, సుధీర్, బోయిని ప్రసాద్, ఆకుల రవిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి గాయాలు
చిట్యాల: కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరికి గాయాలైన ఘటన చిట్యాల మండలంలోని జడలపేట గ్రామ శివారులోని గాంధీనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని జడలపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు మేరుగు రాజయ్య వృత్తిలో భాగంగా రోజులాగే తాటిచెట్లు ఎక్కి తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రాజయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే జిల్లాకేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు.


