జోరుగా తునికాకు సేకరణ | - | Sakshi
Sakshi News home page

జోరుగా తునికాకు సేకరణ

May 25 2026 3:16 AM | Updated on May 25 2026 3:16 AM

జిల్లాల వారీగా వివరాలు..

భూపాలపల్లి: అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు, గిరిజనేతరులకు ఎంతగానో ఆసరాగా నిలిచే తుని కాకు(బీడీ ఆకు) సేకరణ సీజన్‌ ప్రారంభమైంది. కాళేశ్వరం సర్కిల్‌ పరిధిలోని జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లోని 7 డివిజన్లలో ప్రస్తుతం ఆకు సేకరణ జోరుగా సాగుతోంది.

పెరిగిన యూనిట్లు.. లక్ష్య సాధనపై సందిగ్ధం

కాళేశ్వరం సర్కిల్‌ పరిధిలో ఈ ఏడాది మొత్తం 47 యూనిట్లలో ఆకు సేకరణ కోసం జనవరి 23 నుంచి మార్చి 7 వరకు ఐదుసార్లు టెండర్లు పిలిచారు. అందులో 41 యూనిట్లకు కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకోగా, మిగతా 6 యూనిట్లకు ఎవరూ ముందుకు రాలేదు. టెండర్లు ఖరారైన 41 యూనిట్లలో ఈ ఏడాది 40,600 స్టాండర్డ్‌ బ్యాగుల(ఎస్‌బీ) తునికాకు సేకరణను అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 47 యూనిట్లకు గాను 37 యూనిట్లు అమ్ముడుపోగా, 32,900 ఎస్‌బీల లక్ష్యానికి కేవలం 20,537 బ్యాగులు మాత్రమే సేకరించగలిగారు. ఈ 2025 ఖరీఫ్‌ సీజన్‌లో సరైన వర్షాలు లేకపోవడంతో అడవుల్లో ఆకు దిగుబడి తక్కువగా ఉందని, ఉన్నచోట సైతం నాణ్యమైన ఆకులు లేవని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఆశించిన మేరకు కూలీ గిట్టుబాటు అయ్యే అవకాశం లేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వానాకాలం పెట్టుబడికి ఆసరా..

అటవీ గ్రామాల్లో వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత వేసవి కాలంలో చాలామంది తునికాకు సేకరణకు వెళ్తారు. ప్రభుత్వ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు ఆకు సేకరణను ఈ ప్రాంత ప్రజలు తమ రెండవ పంటగా భావిస్తారు. ఈ ఏడాది స్టాండర్డ్‌ బ్యాగు(ఎస్‌బీ)కు ప్రభుత్వం రూ.3,400 ధర నిర్ణయించడంతో కూలీ గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. దీంతో అటవీ గ్రామాలకు చెందినవారు ఎక్కువగా ఆకు సేకరణపై దృష్టి సారించారు. తునికాకు విక్రయించి, వానాకాలం పంటల పెట్టుబడికి అవసరమైన డబ్బులను సమకూర్చుకోనున్నారు.

ఏజెన్సీలో నెలరోజుల పాటు ఉపాధి

కాళేశ్వరం సర్కిల్‌లో

సాగుతున్న పనులు

41 యూనిట్లలో 40,600 స్టాండర్డ్‌ బ్యాగ్స్‌ లక్ష్యం

జిల్లా యూనిట్లు అమ్ముడు లక్ష్యం

పోయినవి (ఎస్‌బీ)

భూపాలపల్లి 19 15 17,600

ములుగు 24 23 19,100

పెద్దపల్లి 4 3 3,200

Advertisement
 
Advertisement
Advertisement