భూపాలపల్లి: జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు తీవ్ర ఎండలు ఉండే పరిస్థితుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల నమోదైన గణాంకాల ప్రకారం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45.7 డిగ్రీలు నమోదయ్యాయన్నారు. రాబోయే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదన్నారు. తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణం, నిమ్మరసం తరచూ తీసుకోవాలని సూచించారు.
వారోత్సవాలు విజయవంతం చేస్తాం..
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక భాగంగా మే 25 నుంచి మే 30 వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. మహిళా వారోత్సవాలపై ఆదివారం హైదరాబాద్ నుంచి రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి సీతక్క అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం..
రానున్న పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్రస్థాయి అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


