భూపాలపల్లి అర్బన్: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరానికి భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వైద్య శిబిరాలను భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మధుసూదన్, ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గోపాల్ రావు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి అందిస్తున్న వైద్యం, మందుల లభ్యత, అత్యవసర సేవల పరిస్థితిపై వివరాలు సేకరించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది విధుల నిర్వహణను సమగ్రంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో భక్తులు వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పుష్కరాల కాలంలో భక్తులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


