భూపాలపల్లి: జనగణన సర్వేలో భాగంగా జరుగుతున్న ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జనగణన, బల్క్ ల్యాండ్ ఇష్యూస్, సాదా బైనామా, భూభారతి, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకే చోట ఉండి సర్వే చేయడం కాకుండా కచ్చిత సమాచారం సేకరణకు ప్రతి ఇల్లు క్షుణ్ణంగా సర్వే చేయాలని ఆదేశించారు. 33 కాలాలతో కూడిన సర్వేలో కొన్ని చోట్ల తప్పులు దొర్లితే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు లాగిన్ ఓపెన్ చేసి, డాటాను ఫొటోలు తీసుకుని తిరిగి తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ విలువల సవరణ చేపట్టాలి..
భూముల మార్కెట్ విలువల సవరణను సమగ్రంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి భూముల మార్కెట్ విలువల సవరణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
రిజర్వాయర్ నిర్మించాలి
మహాముత్తారం: దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా బోర్లగూడెంలో రెండు టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని కుల ప్రజాసంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వాయర్ ఏర్పాటు చేసి మండలంలోని రైతులకు సాగునీరు అందించాలన్నారు. రిజర్వాయర్ ఏర్పాటుకోసం రూ.2వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
రేగొండ: మండలంలోని రేపాకపల్లి గ్రామానికి చెందిన చాగర్ల చంద్రమౌళి ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మృతి చెందాడు. దీంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, నాంసాని రాంబాబు, తదితరులు ఉన్నారు.
కాళేశ్వరంలో
నలుగురి అరెస్ట్
కాళేశ్వరం: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాల్లో భక్తుల టార్గెట్‌గా లక్‌బై చాయిస్ అనే జూదం ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు శనివారం ఎస్సై జి.తమాషారెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. పుష్కర ఘాట్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి స్ట్రైకర్లతో ‘లక్ బై చాయిస్’ జూదం ఆడుతూ కనిపించారు. పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు నలుగురిని పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు కురాకుల వెంకటేష్, మల్లబోయిన శివ, అంబి పోశాలు, కురాకుల సదానందం వద్ద మూడు ఆరెంజ్ రంగు ప్లేయింగ్ స్ట్రైకర్లు, రూ.2,730 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. జూదం ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అపరిశుభ్రంగా
డార్మెటరీ హాల్
చిట్యాల(కాళేశ్వరం): అంత్య పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం డార్మెటరీ (వెయిటింగ్) హాల్ ఏర్పాటు చేశారు. కానీ అపరిశుభ్రంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో పడుకునేందుకు వచ్చే భక్తులు చెత్తాచెదారంలోనే ఉంటున్నారు. రాత్రివేళలో గాలి వస్తుండడంతో దుమ్ము, ధూళి పడుతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


