● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి అర్బన్: నిరుద్యోగులు జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ఎంపికై న 43 మంది యువతీ యువకులకు శనివారం కలెక్టర్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందడం ఆనందదాయకమని తెలిపారు. యువత తమ ప్రతిభను నిరూపించుకునేందుకు జాబ్‌మేళాలు మంచి వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. అనంతరం సీఎం కప్ క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసి అభినందించారు. నేటి విద్యార్థులు రేపటి ప్రతిభావంతమైన క్రీడాకారులుగా ఎదిగి జిల్లా, రాష్ట్రాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్లీన్ డే కార్యక్రమంలో భాగంగా కోటగుళ్ల పరిసరాలను పరిశుభ్రం చేసిన క్రీడాకారులు, ఆర్కియాలజీ డైరెక్టర్ బుజ్జి, సెక్యూరిటీ రాజు, సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రవీందర్‌లను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రఘు, సిబ్బంది సాగర్, యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
● ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగులు క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం ఏరియాలోని ఏరియా వర్క్‌షాప్, ఏరియా ఆస్పత్రి, జీఎం కార్యాలయ ఉద్యోగులకు మల్టీ డిపార్ట్‌మెంటల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సమయపాలన పాటిస్తూ పని గంటలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్క్‌షాప్, హాస్పిటల్, జీఎం కార్యాలయ ఉద్యోగులు బొగ్గు ఉత్పత్తికి పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రతీ ఉద్యోగి బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ సంస్థ లక్ష్యాల సాధనకు తోడ్పడాలని కోరారు. సింగరేణిలో ఉద్యోగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, సమష్టి కృషితో నాణ్యత, ఉత్పాదకత పెంచాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్‌వో టు జీఎం కవీంద్ర, ఏసీఎంఓ డాక్టర్ పద్మజ, అధికారులు రవికుమార్, రాజేశ్వర్, కృష్ణప్రసాద్, రవీందర్, మారుతి, యూనియన్ నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


