భూపాలపల్లి: పంట వ్యర్థాలను కాల్చొద్దు. మట్టిలోని పోషకాలు దెబ్బతింటాయని, అగ్ని ప్రమాదాలు జరిగి నష్టం వాటిల్లుతుందని అధికారులు ఎంత చెబుతున్నా రైతులు వినడం లేదు. పలువురు రైతులు వరి, మొక్కజొన్న కొయ్యలకు నిప్పంటించడం మూలంగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పంటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. నిన్న ఇద్దరు రైతులు సైతం మృత్యువాత పడిన విషాద ఘటన చోటుచేసుకుంది.
మొక్కజొన్న, వరి వ్యర్థాల కాల్చివేత..
జిల్లాలోని 12 మండలాల్లో యాసంగిలో వరి, మొక్కజొన్న పంటలను అధికంగా సాగుచేశారు. యంత్రాలు, కూలీల సహాయంతో పంటలను కోసిన అనంతరం కొయ్యలు, మొక్కజొన్న చొప్ప లాంటి వ్యర్ధాలను వాస్తవానికి భూమిలోనే కలిపి దున్నించాలి. తద్వారా భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. కొయ్యలు భూమిలో ఉంటే దుక్కి దున్నే సమయంలో ఇబ్బంది తలెత్తుతుందనే ఉద్దేశంతో పలువురు రైతులు వాటికి నిప్పంటిస్తున్నారు. ప్రస్తుతం వేడిగాలులు వీస్తుండటంతో ఆ మంటలు ఒక పొలం నుంచి మరొకరి పొలంలోకి వ్యాపించి మొక్కజొన్న, అరటి, వరి పంటలు పూర్తిగా దగ్ధమవుతున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు నష్టపోతున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు..
● ఈ నెల 22న టేకుమట్ల–పంగిడిపల్లి గ్రామాల మధ్య ఓ రైతు పంట వ్యర్ధాలను కాల్చే క్రమంలో ప్రధాన రహదారిపై ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ దగ్ధమైంది. అంతేకాక సుమారు 15 ఎకరాల్లో మంటలు చెలరేగడంతో శ్రీపాల్‌రెడ్డికి చెందిన మోటర్ పైపులు కాలిపోయి మోటర్ బావిలోనే పడిపోయింది.
● ఇదే రోజున కుందనపల్లిలో సైతం ఆరు ఎకరాలకు చెందిన పశుగ్రాసం, డ్రిప్ పైపులు దగ్ధమయ్యాయి. రామకిష్టాపూర్(టి) గ్రామంలో దుద్దెటి కొమురయ్యకు చెందిన 18 క్వింటాల మిర్చి కాలి బూడిదయింది.
● ఇదే రోజున రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో సుమారు 50 ఎకరాల్లో మంటలు చెలరేగి పలువురు రైతుల మోటర్లు, పైపులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు కష్టపడితే గాని మంటలు చల్లారలేదు.
● ఈ నెల 21వ తేదీన టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లిలో సుమారు 40 ఎకరాల్లో మంటలు వ్యాపించి పలువురు రైతులకు చెందిన మోటర్లు, పైపులు, టార్పాలిన్‌లు, వరిధాన్యం పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.
● ఇదే రోజున మొగుళ్లపల్లి మండలంలోని గుడిపహడ్ శివారు పంట పొలాల్లో మంటలు చెలరేగడంతో గుడిపహడ్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతుల వరిగ్రాసంతో పాటు పైపులు తదితర సామగ్రి కాలిపోయాయి. ఈ సంఘటనలన్నీ కూడా పంట వ్యర్ధాలను కాల్చడం మూలంగానే సంభవించినట్లుగా తెలుస్తోంది.
భార్యాభర్తల మృతి..
పంట వ్యర్థాలను కాల్చి చల్లార్చే క్రమంలో శనివారం రేగొండ మండలం రేపాకలపల్లికి చెందిన చాగర్ల చంద్రమౌళి(62) మంటల్లో పడి అక్కడికక్కడే చనిపోగా, అతని భార్య భాగ్యమ్మ(55) ఊపిరాడక మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.
పంట వ్యర్థాలను కాల్చుతున్న రైతులు
మంటలు చెలరేగి ధాన్యం బూడిదపాలు
నాలుగు రోజులుగా వరుస ఘటనలు
తాజాగా మంటల్లో పడి భర్త,
ఊపిరాడక భార్య మృతి


