మొగుళ్లపల్లి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో వనపర్తి మొండయ్య, కదుర్ల కొమురయ్య, మేకల రాజ్ కుమార్, నైనాకంటి కృష్ణారెడ్డి చెందిన సుమారు 100 క్వింటాళ్ల మొక్కజొన్నలు శనివారం దగ్ధమయ్యాయి. దీంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎల్లారెడ్డిపల్లికి చేరుకుని అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట అవశేషాలు, వరి కొయ్యలకు నిర్లక్ష్యంగా నిప్పంటించరాదని సూచించారు. వేసవి కాలంలో చిన్న అజాగ్రత్త కూడా భారీ అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని, రైతులు అప్రమత్తంగా ఉండి తమ పంటలను కాపాడుకోవాలని తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధిత రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ సునీత, సంబంధిత శాఖ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.


