ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
– 8లోu
భూపాలపల్లి: భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండ వేడిమి, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మినహా మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ బోసిపోతున్నాయి. వడదెబ్బ కారణంగా జిల్లాలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు.
రెడ్ అలర్ట్ జారీ..
వాతావరణ శాఖ జిల్లాకు రెడ్‌అలర్ట్ జారీచేసింది. ఈ నెల 21వ తేదీన అత్యధికంగా 46.4 ఉష్ణోగ్రత నమోదు కాగా, శుక్రవారం 45.9 నమోదైనట్లు వెల్లడించింది. నేడు(శనివారం) 45.6, ఆదివారం 44.6 నమోదు కానున్నట్లు ప్రకటించింది. శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో రెండు రోజుల పాటు సైతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కనిపించని జనం..
ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు సాధారణ ఉష్ణోగ్రత ఉంటుంది. 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అధిక ఉష్ణోగ్రతతో పాటు తీవ్ర వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వస్తున్నారు. వ్యవసాయ, ఇతర కూలీలు అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయినప్పటికీ వడదెబ్బలు తప్పడం లేదు.
ఇప్పటికే ఐదుగురి మృతి..
కూలీ పనులకు వెళ్లినవారు అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురై ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు.
● ఏప్రిల్ 30వ తేదీన టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన 40 ఏళ్ల సంగి సుజాత కూలీ పనికి వెళ్లి వచ్చి వడదెబ్బకు గురై మృతి చెందింది.
● ఈ నెల 18న మల్హర్ మండలం తాడిచర్లకు చెందిన తిక్క రమ(54) వడదెబ్బకు గురై హనుమకొండలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
● ఈ నెల 21వ తేదీన ఒకేరోజు జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన దూడపాక పోచయ్య, మొగుళ్లపల్లి మండలం పోతుగల్లుకు చెందిన నాంపల్లి సక్కమ్మ, రేగొండ మండలం బాగిర్ధిపేటకు చెందిన యాకుబ్‌పాషా వడదెబ్బకు గురై మృతిచెందారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడుగురి మృతి
నేడు కూడా రెడ్‌అలర్ట్ జారీ
ఎండ వేడి, వడగాలులతో
జంకుతున్న జనం
మూడు వారాల్లో ఐదుగురు
వడదెబ్బతో మృతి
రానున్న మూడు రోజులు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీచేసిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ప్రజలు ఎండదెబ్బ నుంచి తమను తాము రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే ఇండ్ల నుంచి బయటకు రావాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తాగునీరు సమృద్ధిగా తీసుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, తలపై టోపీ లేదా గుడ్డతో కప్పుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏదేని అస్వస్థతకు గురైతే తక్షణమే వైద్యచికిత్స తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అస్వస్థత అనిపించిన వెంటనే సమీప వైద్య సిబ్బందిని సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.


