విద్యార్థులకు గొప్ప అవకాశం
భూపాలపల్లి అర్బన్: విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకం. ఇంటర్ విద్య కోసం ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో చేరాలని అందరికీ ఉంటుంది. ఇలాంటి వారి కలసాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘కార్పొరేట్ విద్య’ పథకాన్ని తీసుకొచ్చింది. పదో తరగతిలో ప్రతిభ చాటిన వారు ఈ పథకం ద్వారా ఉజ్వల భవితకు బాటలు వేసుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది.
భర్తీపై అధికారుల దృష్టి
కార్పొరేట్ కళాశాల విద్యా పథకం ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి పూర్తి చేసుకున్న వారికి ఓ వరం. రెండేళ్ల పాటు విద్యార్థులయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. అవగాహన లోపం, తగినంత ప్రచారం లేకపోవడంతో ఈ పథకాన్ని విద్యార్థులు వినియోగించుకోవడం లేదనే విమర్శలున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈ విద్యా సంవత్సరం కేటాయించిన సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వీరికే అవకాశం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలతోపాటు దివ్యాంగ విద్యార్థులు ఈ పథకంతో లబ్ధి పొందేందుకు అవకాశం కల్పించింది. 2026– 27 విద్యా సంవత్సరానికి ఇంటర్‌లో చేరేందుకు ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యాసంస్థల్లో పదోతరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
అర్హతలు ఇలా..
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల, ఆదర్శ, కేజీబీవీ, ఎయిడెడ్, బెస్ట్ అవైలబుల్, నవోదయ పాఠశాలల్లో చదివి ఉండాలి. జీపీఏ 7.0 ఆపై సాధించిన వారు అర్హులు.
దరఖాస్తు విధానం
విద్యార్థులు జూన్ 5వ తేదీ వరకు http:// telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 10వ తరగతి పాస్ మెమో, కులం, ఆదాయం (రూ.2లక్షల లోపు ఉండాలి) ధ్రువీకరణ పత్రాలు మీ సేవా ద్వారా పొందినవి, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్‌కార్డు నంబర్, రేషన్‌కార్డు నంబర్, పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలు, ప్రభుత్వ షెడ్యూల్డ్ కులం వసతి గృహాల విద్యార్థులు(3) సంవత్సరాల బోనోఫైడ్ ధ్రువీకరణ పత్రం జతపర్చాలి. ఈ పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ప్రాధాన్య క్రమంలో మూడు కళాశాలలను ఎంపిక చేసుకోవాలి.
కార్పొరేట్ కళాశాల విద్యా పథకంతో పేద విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేయొచ్చు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. రెండేళ్లపాటు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య వసతులు వినియోగించుకోవాలి.
– ఇందిర, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో టెన్త్ పూర్తి
చేసుకున్నవారికి అవకాశం
వచ్చే నెల 5 వరకు ప్రవేశాలకు గడువు


