పంట పొలాల్లో చెలరేగిన మంటలు | - | Sakshi
Sakshi News home page

పంట పొలాల్లో చెలరేగిన మంటలు

May 22 2026 4:22 AM | Updated on May 22 2026 4:22 AM

టేకుమట్ల: పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో మంటలు చెలరేగి సుమారు 40 ఎకరాల్లో మంటలు వ్యాపించిన సంఘటన మండలంలోని ఆశిరెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత రైతుల కథనం ప్రకారం.. ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టాడు. ఆ పంటలకు వడగాల్పులు తోడవడంతో సుమారు 40 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనలో అదే గ్రామానికి చెందిన ఎల్కటి పైడికి చెందిన మోటార్‌, పైపులు, గాజ రాజేందర్‌కు చెందిన విద్యుత్‌ వైరు, ఎల్కటి కుమార్‌కు చెందిన టార్ఫాలిన్‌ పరదాలు, గజ్జి రాజయ్యకు చెందిన రెండెకరాల వరి పంటతో పాటు, మొక్కజొన్న, వరిగడ్డి పూర్తిగా దగ్దమైనట్లు తెలిపారు. కాగా అగ్ని ప్రమాదంలో సుమారు రూ.3లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. రైతులు అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్‌ వెంకటేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో కలిసి మంటలను ఆర్పివేశారు.

అరటి తోట దగ్ధం..

చిట్యాల: మండలంలోని రాంచంద్రాపూర్‌ గ్రామ శివారులో సాయంత్రం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అరటి తోట కాలిపోయింది. పక్కనే ఉన్న టేకుచెట్లకు మంటలు వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాంచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన సిరిపురం కుమారస్వామి నాలుగున్నర ఎకరాల్లో అరటి తోట సాగు చేస్తున్నాడు. ఈక్రమలో పంట చేలో ఉన్న విద్యుత్‌ తీగలు గాలికి తాకడంతో మిరుగులు ఆకులపై పడి మంటలు చెలరేగాయి. గమనించిన గ్రామస్తులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అరటి తోటతోపాటు పక్కనే ఉన్న ఆకుల సమ్మయ్యకు చెందిన టేకుచెట్లు కాలిపోయాయి. పంట చేతికందే సమయంలో దాదాపు రూ.8 లక్షల విలువైన అరటి తోట కాలిపోవడం, అలాగే రూ.రెండు లక్షల విలువ గల టేకుదుంగలు కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. వెంకట్రావుపల్లి (సీ) గ్రామానికి చెందిన బాలవేణి వేణుకు చెందిన ఎకరన్నర మిరప తోట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పంట చేనులో ఉన్న 40 పైపులు, విద్యుత్‌ మోటారు కాలి బూడిదైనట్లు బాధితుడు తెలిపాడు. సుమారు 1.5లక్షల నష్టం వాటిల్లిందన్నారు.

గుడిపహాడ్‌ శివారులో..

మొగుళ్లపల్లి: మండలంలోని గుడిపహాడ్‌ శివారులోని పంట పొలాల్లో ప్రమాదవశాత్తు గురువారం మంటలు అంటుకున్నాయి. గాలికి మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులో పంటపొలాల్లో ఉన్న పశుగ్రాసంతోపాటు వ్యవసాయ పనిముట్లు కాలిపోయాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేయడానికి రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అగ్ని మాపక వాహనానికి సమాచారం అందించినా.. వాహనం అందుబాటులో రాలేదు. వల్ల పొలాల్లో విపరీతమైన పొగ కమ్ముకుంది. స్థానికులు ఎంతో శ్రమించి మంటలు గ్రామాల్లోకి రాకుండా అదుపుచేశారు.

పంట వ్యర్థాలు కాల్చే క్రమంలో ప్రమాదం

టేకుమట్లలో 40 ఎకరాల్లో

వ్యాపించిన వైనం

పలు గ్రామాల్లో కాలిపోయిన

వ్యవసాయ పనిముట్లు

అగ్నికి ఆహుతి అయిన అరటి, మిర్చి తోటలు

Advertisement
 
Advertisement
Advertisement