98.36 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

98.36 శాతం ఉత్తీర్ణత

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

98.36 శాతం ఉత్తీర్ణత ఉత్తీర్ణత శాతం పెరిగింది

ఎంజేపీ విద్యార్థినుల ప్రతిభ

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 98.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఫలితాల్లో వెనుకబడి ఉన్న జిల్లా ముందువరుసలో ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. నవంబర్‌ మాసం నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ సీబీఎస్‌ఈ తరహాలో తయారు చేసి పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహించారు. ఒక్కో పరీక్షకు మధ్య నాలుగైదు రోజుల వ్యవధి ఏర్పడింది. ఫలితంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో నిలించింది.

సంవత్సరాల వారీగా ఫలితాలు ఇలా..

జిల్లా వ్యాప్తంగా 122 ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 3,541 మంది విద్యార్థులకు గాను 3,483 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 1,750 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 1,708 ఉత్తీర్ణత సాధించారు. అలాగే 1,791 బాలికలకు 1,775 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 98.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 58 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు.

ఫలించిన ప్రత్యేక తరగతులు

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పరీక్ష ఫలితాలు 100 శాతం సాధించే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. ఇందులో భాగంగా 2025 నవంబర్‌ నుంచి పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. సెలవు రోజుల్లో కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు నిర్ణయించిన వాటి కంటే అదనంగా టెస్టులు నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అభ్యాసదీపిక పేరుతో ముఖ్యమైన ప్రశ్న, జవాబులతో కూడిన పుస్తకాలను అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకోని ప్రతీరోజు ఉదయం 4 గంటల నుంచే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి నిద్రలేపించడం, చదివించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

పెరుగుతూ.. తగ్గుతూ..

జిల్లాల పునర్విభజన తర్వాత 2016–17 సంవత్సరంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్రంలో 14 స్థానం, 2017–18లో 5వ స్థానం, 2018–19లో 7వ స్థానాల్లో నిలిచింది. 2019–20, 2019–21వ సంవత్సరానికి కోవిడ్‌ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. 2021–22లో 8, 2022–23లో 5వ స్థానం, 2023–24లో 16వ స్థానం, 2024–25 22వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 11వ స్థానానికి పెరిగింది. ఈ ఏడాది 58 మంది విద్యార్థులు ఫెయిల్‌ కాగా వీరిలో ఎక్కువగా తెలుగు, గణితం సబ్జెక్టులో ఫెయిల్‌ అయినట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాల నుంచి టెన్త్‌ ఫలితాల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పదో తరగతి ఫలితాల్లో గతేడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో రావడం సంతోషకరం. వందశాతం ఫలితాల లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. గతేడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాం. ఇదే ఉత్సాహంతో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకా మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేస్తాం.

– రాజేందర్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ

గణపురం: మండలంలోని గాంధీనగర్‌ మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. ఎస్‌.వేదిత 579 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఎం. లక్ష్మిప్రసన్న 576, కే. అర్చన 573, బి.వైష్ణవి 570, సాయిప్రియ 569, ఏ.రోజా 568 మార్కులు సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement