ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి

భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన సేఫ్టీ రివ్యూ సమావేశంలో జీఎం పాల్గొని మాట్లాడారు. డైరెక్టర్‌ కోల్‌ మైన్స్‌ రెగ్యులేషన్స్‌–2026లో జరిగిన కీలక మార్పులు, ఈ ఏడాది భూపాలపల్లి ఏరియాలో నమోదైన ప్రమాదాలు, వాటి కారణాలు, నివారణ చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ మాటూరి రవీందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని గనుల అధికారులు, ప్రాజెక్ట్‌ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. అనంతరం జీఎం మాట్లాడుతూ గత సమావేశ నిర్ణయాల అమలు స్థితిని సమీక్షించిన అధికారులు, కొత్తగా తీసుకొచ్చిన సేఫ్టీ సవరణలు గనుల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. భద్రతా ప్రమాణాల అమలు విధానం, ఫీల్డ్‌ స్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. గతంలో జరిగిన ప్రమాదాలపై విశ్లేషణ చేస్తూ, మానవ తప్పిదాలు, యంత్రాంగ లోపాలు, భద్రతా నిబంధనల నిర్లక్ష్యం తదితర ప్రధాన కారణాలను గుర్తించారు. భవిష్యత్‌లో ప్రమాదాలు నివారించేందుకు సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు, కార్మికులకు నిరంతర శిక్షణ, ఆధునిక సాంకేతికత వినియోగం వంటి చర్యలు చేపట్టాలన్నారు. భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రతీ ఉద్యోగి నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సంస్థలో సేఫ్టీ సంస్కృతి బలపడాలని, జీరో ప్రమాద లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ఓసీ త్రీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ భిక్షమయ్య, గనుల మేనేజర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement