బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
నాన్నా.. చాక్లెట్లు కొనిస్తానన్నావు.. ఊరంతా తిప్పి ఊరవతలికి తీసుకువచ్చావు ఎందుకు నాన్నా.. చెట్టుకిందికి తీసుకువచ్చి తాడు తీస్తుంటే ఏదో ఊయల కడుతున్నావు అనుకున్నాం. నాకు, తమ్ముడి మెడకు చుట్టావు. ఏదో ఆట అనుకున్నాం. కొమ్మపైనుంచి తీసి లాగుతున్నావు. ఊపిరి ఆడట్లేదు నాన్న. ఇంకోసారి చాక్లెట్లు అడగము. గొంతు బిగుసుకుపోతోంది. తాడు తీయ్ నాన్నా.. నేను తమ్ముడు బాధ భరించలేకపోతున్నాం. మమ్ముల్ని కిందికి దింపు నాన్నా.. అమ్మకు, నీకు మధ్య మేము అడ్డుగా ఉన్నామా.. మీరిద్దరు పంచాయితీ పెట్టుకుంటే మాదా తప్పు. మేమేం చేశాం నేరం.. మీ పిల్లలుగా పుట్టడమా.. ’ అంటూ ఆ చిన్నారులు తమ ఆఖరి క్షణాల్లో తండ్రిని వేడుకున్నారేమో.. ఆ మాటలకు తండ్రి మనస్సు కరిగి కిందికి దించి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవి. కానీ, పిల్లల రోదనలు వినే పరిస్థితిలో లేని తండ్రి.. ఇద్దరి ప్రాణాలు పోయేవరకు అక్కడే రాయిలా నిలబడి చూశాడు. విగతజీవులయ్యారని నిర్ధారించుకున్నాక సమాజం తనను ఛీ కొడుతుందని భావించి అదే చెట్టుకు ఉరివేసుకున్నాడు.
బిడ్డలకోసం నూటొక్క ముడుపులు కట్టి.. కోటొక్కా.. పూజలు చేసిన వారు ఉన్నారు.. ఇది సమాజంలో ఒకవైపు ఉంటే.. భార్యాభర్తల తగాదాలు, వివాహేతర సంబంధాలు, క్షణికావేశాలతో కన్నబిడ్డలను కర్కశంగా చంపిన ఘటనలు మరోవైపు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆ పసికూనలను ఓ తండ్రి చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. కింద పడితేనే తండ్రి గుండె పగిలినంత బాధ ఉంటుందంటారు.. కానీ, పిల్లలను ఉరివేసి వారి ప్రాణం పోయేదాక చూసిన అతను ఎంత కర్కోటకుడోనని, అతనికి మనస్సెట్టా వచ్చిందని.. ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోయారో అంటూ ఈ ఘ టన చూసిన, విన్న స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదన్న అక్కసుతో..
తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (29), అదే గ్రామానికి చెందిన కిన్నెర కాంతను 11 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వారికి కూతురు విన్య, కుమారులు విలాస్ (5), వికేష్ (3) ఉన్నారు. గుంశావలి తొర్రూరులోని ఓ బైక్ మెకానిక్ షాప్‌లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన గుంశావళి రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ బాధలు భరించలేక కాంత పది రోజుల క్రితం అదే గ్రామంలోని నానమ్మ సీతమ్మ ఇంటికి పిల్ల లను తీసుకొని వెళ్లింది. గుంశావలి.. పది రోజులుగా పిల్లల కోసం వెళ్తే ఆమె పంపించడం లేదు. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని పిల్లలు భార్య వద్ద కూడా ఉండొద్దని కక్ష గట్టాడు. కాంత సోమవారం రోజువారీగా కూలి పనికి వెళ్లగా ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. కూతురు ఆడుకోవడానికి మరోచోటికి వెళ్లింది. సమయం చూసి వచ్చిన గుంశావలి పిల్లలకు చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపగా మానాన్న కొనిస్తాడు అంటూ హుషారుగా తండ్రి బైక్‌పై ఎక్కారు. గుంశావలి తొర్రూరుకు వచ్చి ఓ దుకాణంలో తాళ్లు కొనుగోలు చేశాడు. పిల్లలు నాన్నా చాక్లెట్లు ఏవీ అంటే కొనిస్తానని నమ్మబలికాడు. సాయంత్రం వరకు అటు ఇటు బైక్‌పై తిప్పాడు. పిల్లలు కూడా సరదాగా ఉందనుకున్నారు. సాయంత్రం తొర్రూరు మార్కెట్ సమీపంలో చెట్టుకు మొదట ఇద్దరు పిల్లలకు ఉరివేసి తరువాత తనూ ఉరేసుకున్నాడు. కాగా, కాంతకు సొంత ఇల్లు, జాగ లేదు.
బంధువులింటి సమీపంలో ఓ టెంట్ వేసుకుని
భర్త, పిల్లల మృతదేహాల కోసం
ఎదురుచూడడం గమనార్హం.
కిన్నెర
గుంశావలి (ఫైల్)
విలాస్ (ఫైల్)
వికేష్ (ఫైల్)
పనికి వెళ్లిన భార్య కాంత సాయంత్రం ఇంటికి వచ్చి తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లారని కుమార్తె విన్యను అడగగా నాన్న తీసుకువెళ్లాడని బదులిచ్చింది. ఆందోళన చెందిన కాంత స్థానికుల సహాయంతో ఆటో తీసుకొని బావులు, చెరువులు, సమీప ప్రాంతాల్లో గాలించగా ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం తొర్రూరులో పిల్లలు చంపిన ఘటన వెలుగులోకి రావడం.. పోలీసులు వివరాలు సేకరించి తల్లికి సమాచారం అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై భార్య కాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.
చాక్లెట్లు కొనిస్తానని చెప్పి
మెడకు తాళ్లు బిగించావు..
ఎప్పుడూ చాక్లెట్లు అడగము.. నొప్పిగా
ఉంది.. తాడు విప్పి దించు నాన్నా..
అయినా నీ మనస్సు కరగలేదా..
తొర్రూరులో ఇద్దరు కొడుకులకు మరణశాసనం రాసి తనూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి
కుటుంబ కలహాలకు పిల్లలు బలి
గుండెలవిసేలా రోదించిన తల్లి, బంధువులు


