తాగి నడుపుడు.. పోలీసులకు దొరుకుడు | - | Sakshi
Sakshi News home page

తాగి నడుపుడు.. పోలీసులకు దొరుకుడు

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

తాగి నడుపుడు.. పోలీసులకు దొరుకుడు నిత్యం తనిఖీలు చేస్తున్నాం.. నెలకు వందకు పైగా కేసులు..

అవగాహన కల్పిస్తున్నా ఫలితం శూన్యం..

మద్యం మత్తులో వాహనాల డ్రైవింగ్‌

భూపాలపల్లి: ఆ సెంటర్‌లో పోలీసోళ్లు ఉంటరు.. బండి ఈ సందులో నుంచి పోనియ్యి... అరె అక్కడ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌ చేస్తున్నారు.. బైక్‌ ఇక్కడే ఆపు. కొద్దిసేపు ఆగి, పోలీసులు వెళ్లాక వెళ్దాం.. మద్యం సేవించి వాహనం నడిపే వారు ప్రతీ రోజు తీసుకునే జాగ్రత్తలు ఇవి. మందు తాగి వాహనం నడపడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా, పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా కూడా కొందరిలో మార్పు రావడం లేదు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతుంది. ప్రతీ రోజు ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్షణికానందం కోసం మద్యం మత్తులో వాహనం నడిపి జీవితాలను నాశనం చేసుకోవద్దు. డ్రంకెన్‌ డ్రైవ్‌ వలన జరిగే ప్రమాదాలు, అనార్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వివరిస్తున్నాం. వాహనదారులు తమ బాధ్యతను గుర్తించి మద్యం సేవించి వాహనం నడపొద్దని మా సూచన.

– సిరిశెట్టి సంకీర్త్‌, ఎస్పీ

గడిచిన మూడు నెలల కాలంలో (జనవరి నుంచి మార్చి వరకు) జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 90 రోజుల వ్యవధిలోనే పోలీసులు 344 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. సగటున రోజుకు సుమారు నలుగురు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కుతున్నారు. పట్టుబడ్డ వారిలో ఇప్పటివరకు 142 మంది వాహనదారులు కోర్టు ముందు హాజరుకాగా, వారికి న్యాయస్థానం రూ. 1,50,360 జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనం నడపడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు, ఒకరికి జైలు శిక్ష కూడా విధించింది. మిగిలిన కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

డ్రంకెన్‌ డ్రైవ్‌ వలన జరిగే ప్రమాదాలు కేవలం వాహనదారుడికి మాత్రమే కాక రోడ్డుపై వెళ్లే అమాయకులు కూడా బలి అవుతున్నారు. ఇంటి యజమాని మత్తులో చేసే చిన్న పొరపాటుతో భార్యాపిల్లలు అనాథలవుతున్న ఉదంతాలు జిల్లాలో అనేకంగా ఉన్నాయి. పోలీసులు ఎంతో ఓపికతో నెలలో నాలుగైదుసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు.

మూడు నెలల్లో 344 కేసులు

ఒకరికి జైలు శిక్ష,

142మందికి జరిమానాలు

మందుబాబుల్లో కానరాని మార్పు

Advertisement
 
Advertisement
Advertisement