మంగపేట: మల్లూరులోని శ్రీ హేమాచల క్షేత్రంలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం గరుడాదివాసం కార్యక్రమాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రెండోరోజూ కార్యక్రమంలో భాగంగా ఆల య ఇన్‌చార్జ్ ఈఓ వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ సత్యనారాయణ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల యాగ్నికులు ఉదయం 8 గంటలకు ఆలయ ప్రాంగణంలోని పంచముఖాంజనేయ స్వామి వారి కి స్నపనం (అభిషేకం) పూజలు నిర్వహించారు.
యాగశాలలో పూజలు
యాగశాలలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవ మూర్తులకు సేవాకాలం, బాలబోగం నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా వైనతేయ లేఖనం (గరుడ) గరుడ చిత్రపటం వేసి ఆవాహనం పూజలు నిర్వహించారు. నేత్రోన్మీలన, గరుడాదివాసం, సేవాకాలం, నివేదన, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. గర్భాలయంలోని స్వయంభు స్వామివారికి వేదమంత్రోశ్చరణతో ప్రత్యేక అర్చనలు జరిపించి వెండి కవచం, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు. బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్ శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్‌చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పాల్గొన్నారు.
జాతరకు పటిష్ట బందోబస్తు
వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల (జాతర) సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయమైన ఘటనలు తలెత్తకుండా నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, 100 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపారు. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనకు మంగళవారం వచ్చిన ఆయన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు.
అభయాంజనేయ స్వామికి స్నపనం
స్వయంభు లక్ష్మీనర్సింహస్వామికి
ఆభరణాల అలంకరణ


