భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంతాల చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాన్ని జీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారులు వేసవి సెలవులను సమర్థంగా వినియోగించుకుని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచడంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. క్యాంప్‌లో అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్ క్రీడల్లో నిపుణుల ద్వారా శిక్షణ అందించబడుతుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఈ శిక్షణలో పాల్గొనే అవకాశం కల్పించినట్లు చెప్పారు. మే 22వ తేదీ వరకు ఈ శిక్షణ శిబిరం నిర్వహించబడుతుందని, ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని వివరించారు. క్రమబద్ధమైన శిక్షణతో పాటు క్రీడా నైపుణ్యాల అభివృద్ధికి అవసరమైన మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇన్‌చార్జ్ పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, ఐఎన్‌టీయూసీ నాయకులు హుస్సేన్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ నజీర్, క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్‌కుమార్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, కోఆర్డినేటర్ పాక దేవయ్య పాల్గొన్నారు.
జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి


