బోసిపోయిన టైలరింగ్ స్టోర్
ఐటీడీఏ పీఓకు..
తెరుచుకోని టైలరింగ్ శిక్షణ కుట్టుమిషన్ల కేంద్రం
● ఈఎస్‌ఎస్‌లో గ్రౌండింగ్ అంతంతే..
● ముందుకు సాగని రైతు భరోసా, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల సరళీకృతం
● పరిష్కారానికి నోచుకోని గిరివాణి వినతులు
ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా లెనిన్ వాత్సల్ టొ ప్పో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంత రం పలు విభాగాల్లో తనిఖీ నిర్వహించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. నూతనంగా బా ధ్యతల చేపట్టిన పీఓకు మాత్రం ఐటీడీఏలో నెలకొ న్న అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
2020–21 నుంచి ఇప్పటి వరకు ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్‌ఎస్) పథకంలో గ్రౌండింగ్ చేయడం లేదు. 631 మందిని పథకం కింద ఎంపిక చేసి 274 మందికి గ్రౌండింగ్ చేశారు. మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి ఆర్థిక శాఖ నుంచి ట్రైకార్, ట్రైబల్ వెల్ఫేర్‌కు నిధులు వస్తేగానీ బ్యాంకుల్లో జమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇంతలోనే రాజీవ్ యువ కిరణాలను తెరపైకి తేవడంతో ఈఎస్‌ఎస్ మరుగున పడింది. అలాగే గిరివికాసం కింద రైతులకు బోరు, మోటారు, విద్యుత్ సరఫరా ఉచితంగా ఇవ్వాలని వచ్చిన 431 దరఖాస్తులు మూడేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ఇటీవల పీఎం కుసమ్ యోజన పథకం కింద గిరిజనులకు సోలార్ పంపు సెట్లు, మోటార్లను అందించేందుకు సర్వేలు చేపట్టి వాటిని కేవలం కాగితాలకు పరిమితం చేశారు. అలాగే సోలార్ ప్లాంట్స్ ఏర్పా టు చేసేందుకు ఐటీడీఏ మహిళలకు అవగాహన కల్పించి పేర్లను నమోదు చేశారు. కానీ సంఘాల పేర్ల మీద భూములు మాత్రం కేటాయించలేదు.
శివాపురంలోని సబ్బుల పరిశ్రమకు జీసీసీ ద్వారా రూ. 30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇప్పించాలని అనేకమార్లు గిరివాణిలో వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోవడంతో మూసివేశారు. వెంకటాపురం(కె) మండలం ముత్తారం గ్రామంలో నడుపుతున్న సొసైటీ క్వారీ మూడేళ్ల నుంచి గ్రామంలోని సభ్యులకు కమీషన్లు ఇవ్వడం లేదు. దీంతో గిరివాణిలో ఫిర్యాదు చేయగా ఇంత వరకు పట్టించుకోలేదు. సొసైటీ, క్వారీ వివరాలు సైతం గోప్యంగా ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. హార్టికల్చర్ నర్సరీలో గతంలో రూ.23 లక్షలు వెచ్చించి పామాయిల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేయగా ఒక్క మొక్క కూడా బతకలేదు. దీంతో రూ. 23 లక్షల నిధులు బురదలో పోసినట్లు అయ్యింది. మళ్లీ ఆ భూమిలో పండ్ల తోటల కోసం ప్లాన్ చేశారు కాని ఆచరణలోకి తీసుకురాలేదు. ఇలా అనేక సమస్యలతో ఐటీడీఏ కొట్టుమిట్టాడుతోంది. ఇవేకాకుండా ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న గిరివాణిలో అనేక మంది గిరిజనులు వినతులు ఇస్తున్నా పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా పీఓగా బాధ్యతలు చేపట్టిన టొప్పో తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
గిరిజన మహిళా సంఘాలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత కుట్టు మిషన్లను అందజేసి ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించి వారికి ఇచ్చేలా అప్పటి పీఓ చిత్రామిశ్రా ప్లాన్ చేశారు. కాని ఆమె బదిలీ కావడంతో ఆ పనులు మూలకుపడ్డాయి. దీంతో స్టోర్ బోసిపోయి కనిపిస్తోంది. అంతేకాకుండా కొంత మందికి ఇటుకల తయారీకి మిషనరీలు ఇవ్వగా వాటిని కేవలం ఇంటి వద్ద ఏర్పాటు చేసుకొని ఎలాంటి పరిశ్రమలను నడపడం లేదు. దీంతో లక్షలాది రూపాయల సామగ్రి తుప్పుపట్టిపోతుంది. ఇదేకాకుండా న్యూట్రిబాస్కట్ పరిశ్రమను సైతం నడిపించలేక మహిళా గ్రూపు సభ్యులు దానిని మూసివేశారు. సరైన ఆదాయం, ఉత్పత్తి లేదని చేతులు ఎత్తేశారు.


