భూపాలపల్లి: దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు వేసవిలో ఇబ్బంది ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు దళారులు, రేషన్ డీలర్లు బియ్యాన్ని కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని పలు రైస్‌మిల్లులకు సరఫరా చేస్తున్నారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే అప్పగించేందుకు పలువురు మిల్లర్లు సిద్ధమవుతున్నారు.
జిల్లాలోని 12 మండలాల్లో అంత్యోదయ, ఎఫ్‌ఎస్‌సీ, అన్నపూర్ణ కార్డులు కలిగిన కుటుంబాలు సుమారుగా 1,38,234 ఉండగా, 3,91,353 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు 6 కేజీల చొప్పున ప్రతీ నెల 25,36,167 కేజీల బియ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్నాయి. వేసవి నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్ధేశంతో ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందజేస్తుంది. ఈసారి వచ్చిన సన్నబియ్యం అంతగా నాణ్యత లేవు. నూకశాతం కూడా ఎక్కువగా ఉంది. దీంతో లబ్ధిదారులు వాటిని వండుకునేందుకు ఇష్టపడటం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న జిల్లాలోని పలువురు డీలర్లు... లబ్ధిదారులతో వేలిముద్ర వేయించుకొని కేజీ బియ్యానికి రూ.12నుంచి రూ.15 చొప్పున లెక్కకట్టి ఫోన్ పే చేస్తున్నారు. ఇండెట్‌లో తేడా రాకుండా ఉండేందుకు అదే రోజు రాత్రి ఆ బియ్యం మొత్తాన్ని రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు. 10 క్వింటాల నుంచి 20 క్వింటాల బియ్యం జమ అయ్యాక అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలోని రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు.
దళారుల దందాలో మార్పు లేదు. జిల్లాలోని ప్రతీ మండలంలో ఒకరిద్దరు దళారులు రేషన్ బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ. 20 చొప్పున కొనుగోలు చేసి కమిషన్ పద్ధతిన దళారికి విక్రయిస్తున్నారు. ఆ బియ్యం పెద్ద మొత్తం అయ్యే వరకు గుట్టుచప్పుడు కాకుండా రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నారు.
దళారులు సేకరించిన బియ్యాన్ని జిల్లాలోని కొందరు రైస్‌మిల్లర్లు కేజీకి రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏస్ ట్రాలీ, డీసీఎం వ్యాన్‌లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్‌మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్(సంచులు మార్చి) చేసి తిరిగి సివిల్ సప్లయీస్ గోడౌన్‌లకు పంపించేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్‌లై శాఖతో పాటు పోలీసుశాఖలోని కొందరు అధికారులు ఈ అక్రమ దందాకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పీడీఎస్ బియ్యం రవాణాపై పెద్దగా దాడులు జరగడం లేదని తెలుస్తోంది.
పేదల బియ్యం పక్కదారి
జోరుగా సాగుతున్న అక్రమ దందా
బస్తాలు మార్చి సీఎంఆర్‌కు
సిద్ధం చేస్తున్న మిల్లర్లు


