మంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ ఇన్‌చార్జ్ అధికారి వీరస్వామి తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు.
అంకురార్పణతో జాతర ప్రారంభం
హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యాగశాలలో విశ్వక్షేనపూజా, భగవత్ పుణ్యాహ వాచన, పసరిషత్ ప్రార్థన, రుత్విక్‌వరణం, రక్షాబంధనం, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగస్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిశేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజారోహనం, 30న ఎదుర్కోలు మహోత్సవం, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4వ తేదీన తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, గజవాహనసేవ, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు.
మే 1న స్వామివారి తిరుకల్యాణం
హేమాచల క్షేత్రంలో 10 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1న లక్ష్మీనర్సింహస్వామికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుల అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం తిరుకల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రకృతి ఒడిలో స్వయంభువుగా వెలిసి భక్తులకు కోరిన వరాలిచ్చే లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ధృవమూర్తులకు గర్భాలయంలో ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాల యాగ్నికులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించనున్నారు. అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు కల్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
చింతామణి జలపాతం.. నాభిచందన ప్రసాదం
ఆలయ సమీపంలో సహజసిద్ధంగా వెలిసిన చింతామణి జలపాతం ఆలయానికి వచ్చే భక్తులు ఔషధ గుణాల ప్రసాదంగా బావిస్తుంటారు. హేమాచల కొండపై నుంచి ఏడాది పొడవునా అన్ని కాలాల్లో ఒకే విధంగా చింతామణి జలపాతం భూమి లోపలి నుంచి పారుతూ ఉండటం విశేషం. ఆలయానికి వచ్చే భక్తులు చింతామణి జలపాతం వద్ధ స్నానమాచరిస్తారు. జలపాతం నుంచి వచ్చే నీరు అతి శీతలంగా ఔషధ గుణాలు కలిగి మినరల్ వాటర్‌ను తలపించే విధంగా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎన్నిరోజులు నిల్వ ఉంచినా పాడై పోకుండా ఉండటంతో నీటిని రోజు సేవిస్తే బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు ధరిచేరవు. అలాగే ఆలయంలో ప్రతీ శని, ఆదివారం స్వామివారి నాభి నుంచి స్రవించే ద్రవాన్ని మంచి గందంతో కలిపి(నాభి చందనం) సంతానం లేని వారు సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
నేటి నుంచి పది రోజుల పాటు
కార్యక్రమాలు
ముస్తాబైన ఆలయం..
తరలిరానున్న భక్తజనం


