భూపాలపల్లి అర్బన్ : నూతనంగా సింగరేణి ఉద్యోగంలో చేరిన కార్మికులకు రక్షణ పరికరాలు (బూట్లు, టోపీలు) తక్షణమే అందజేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ పరికరాలు లేకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యాజమాన్యం స్పందించి తక్షణమే రక్షణ కిట్లను అందజేయాలన్నారు. క్వార్టర్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గురిజేపల్లి సుధాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
మల్హర్(కాటారం): రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతను పెంపొందించేందుకు కాటారం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కమలాపూర్ క్రాస్ నుంచి కాళేశ్వరం వరకు ఉన్న రహదారిపై, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని పోలీసులు సూచిస్తున్నారు.
బకాయిలు విడుదల చేయాలి
భూపాలపల్లి అర్బన్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అనంతరం బీఆర్‌ఎస్వీ నాయకులు దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నేడు (సోమవారం) కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం, 28న విద్యార్థులతో కలిసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డుల ద్వారా ఫిర్యాదు చేయడం, 29న జిల్లాలోని డిగ్రీ, వృత్తి విద్య కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు మాడ హరీశ్‌రెడ్డి, యుగేంద్రాచారి, ఆకుదారి మనోహర్, వంశీ, 5వ వార్డు కౌన్సిలర్ కట్ల పూర్ణచందర్, బీఆర్‌ఎస్వీ నాయకులు భూక్య హరీశ్, కత్తి వినయ్, కళ్లపల్లి ప్రేమ్‌దేవ్ పాల్గొన్నారు.
బ్రహ్మంగారి ఆరాధన
మహోత్సవాలు
రేగొండ: మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోవిందామాంబా సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అభిషేకాలు నిర్వహించి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇటీవల హామీ ఇచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు శృంగారపు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగారపు భిక్షపతి, విష్ణుమూర్తి, గురుమూర్తి, కాజుబోజు సూర్యప్రకాశ్, వేణు, రమేష్, దేవేందర్, రామ్మూర్తి, సమ్మయ్య, అంజి పాల్గొన్నారు.


