ఎవరి వాటా వారికి రావాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

ఎవరి వాటా వారికి రావాల్సిందే..

Apr 27 2026 8:12 AM | Updated on Apr 27 2026 8:12 AM

భూపాలపల్లి రూరల్‌: ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా దక్కాలనే నినాదంతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్‌, ధర్మ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్‌ హాల్‌లో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగ బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విశారదన్‌ మహారాజ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేవలం కులాలను లెక్కపెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. కుల గణన అసలు పరమార్థం.. దేశ సంపదను, భూమిని, రాజ్యాధికారాన్ని ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడమేనని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ గణతంత్ర స్ఫూర్తి అదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంపద సమ పంపిణీ జరగడం లేదన్నారు. భూమి, రాజ్యం, అధికారాలన్నీ కేవలం ఒక్క సామాజిక వర్గానికే (రెడ్డి కులానికే) అప్పగిస్తున్నారని మండిపడ్డారు. బ్యూరోక్రసీలోనూ, మంత్రి పదవుల్లోనూ అగ్రవర్ణాలకే పట్టం కడుతున్నారని, ఇదే బాటలో గత ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా నడుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం దక్కే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. 10 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న అధికారాన్ని బహుజనుల పరం చేయడమే జేఏసీ లక్ష్యమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నాదం కుమారస్వామి, బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజ్‌, వివిధ సంఘాల సనాయకులు అజ్మీర సమ్మయ్య, రాదండి దేవేందర్‌, దుగ్యాల స్వామి, చంద్రగిరి శంకర్‌, భీమనాదని సత్యనారాయణ, సాయిబాబా, మేకల సుమన్‌, కొత్తూరు రవీందర్‌, చిట్యాల శ్రీనివాస్‌, అశోక్‌ పాల్గొన్నారు.

కుల గణన చేస్తే సరిపోదు..

సంపదను పంచాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌

విశారదన్‌ మహారాజ్‌

Advertisement
 
Advertisement
Advertisement