మే 10 వరకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

మే 10 వరకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌

Apr 27 2026 8:12 AM | Updated on Apr 27 2026 8:12 AM

భూపాలపల్లి: ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి జనగణన డిజిటల్‌ నమోదు కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తన నివాసంలో సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ విధానంలో స్వయంగా తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడంతో ప్రజల సమయం ఆదా అవుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 11వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ఆ సమయంలో ముందుగా సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసిన వారు నమోదు సమయంలో పొందిన ఐడీ నంబర్‌ తెలియజేయాలని సూచించారు. సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసిన ప్రతీ ఒక్కరు ఐడీ నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ బాధ్యతతో పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్‌ పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు పాల్గొనాలి..

జనాభా లెక్కల స్వీయ జనగణనలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. ఆదివారం ఐడీఓసీ కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియపై ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా స్వీయ గణన ప్రక్రియ వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమం జనాభా గణన 2027 కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం కొనసాగుతుందని, ఇందులో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు ప్రతీ ఒక్కరూ పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, సీపీఓ జవహర్‌, డీపీఆర్‌ఓ శీలం శ్రీనివాస్‌, ఆర్డీఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement
 
Advertisement
Advertisement