క్రీడా శిబిరాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

క్రీడా శిబిరాలకు వేళాయె

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

సమయం వృథా కాకుండా.. నిధుల కేటాయింపు.. నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునే విధంగా..

రేపటి నుంచి 31 వరకు నిర్వహణ

అన్ని వసతులు కల్పిస్తాం..

భూపాలపల్లి అర్బన్‌: విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఉచితంగా క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. చిన్నారులకు ఆహ్లాదమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన క్రీడాకారులు, పీఈటీల పర్యవేక్షణలో శిక్షణ అందించనున్నారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలోనే 40 రోజుల పాటు ఆయా క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ నెల 24న వేసవి శిబిరాలను ప్రారంభించారు. వేసవిలో ఇళ్లలో ఖాళీగా ఉండే పిల్లలకు ఇది చక్కటి అవకాశం.

14 ఏళ్లలోపు బాలబాలికలు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అర్హులు. వేసవి సెలవులు వృథా కాకుండా వారికి ఇష్టమైన ఆటల్లో ప్రత్యేక శిక్షణ కల్పించనున్నారు. ఆధునిక యుగంలో పిల్లలు స్మార్ట్‌ పోన్లు, టీవీలకు అతుక్కుపోయి, చిన్న వయసులోనే అనా రోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు. సెలవులను గ్రామీణ, పట్టణ ప్రాంత పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్లుగా ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలల ఆవరణ, అందుబాటులో మైదానాలు, క్రీడా ప్రాంగణాల్లో ఆయా క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

జిల్లాకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.60వేల నిధులు కేటాయించింది. ఒక్కో కోచ్‌కు రూ.5 వేల చొప్పున, మొత్తం జిల్లాలో 10 శిక్షణ శిబిరాలు నిర్వహించుకోవడానికి రూ.50 వేలు కోచ్‌లకు గౌరవ వేతనం కోసం కేటాయించారు. ప్రమాదంలో గాయాలైతే ప్రాథమిక చికిత్స అందించేందుకు మెడికల్‌ కిట్‌కు ఇతరత్రా నిర్వహణకు రూ.10 వేలు ఖర్చు చేయనున్నారు.

ఆటలకు దూరమైన పాఠశాలలకు చెందిన పిల్లలు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే క్రీడా నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవచ్చు. ముఖ్యంగా వేసవిలో సమయాన్ని వృథా కాకుండా ఇష్టమైన ఆటను నేర్చుకుని పట్టు సాధించే అవకాశం ఉంటుంది. సమయ పాలన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవాటు, ఆటలు ఆడుకునే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు. భవిష్యత్‌లో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశాలుంటాయి. ఈ క్రీడల్లో పతకాలు సాధిస్తే క్రీడా కోటా కింద ఉన్నత విద్య నభ్యసించవచ్చు. ఉపాధి అవకాశాలకు కూడా ఆ పతకాలు ఎంతో ఉపయోగపడుతాయి.

కాటారం ఖోఖో

చల్లగరిగ కబడ్డీ

గణపురం బాల్‌బ్యాడ్మంటన్‌

మహదేవపూర్‌ వాలీబాల్‌

అంబట్‌పల్లి వాలీబాల్‌

టేకుమట్ల షటిల్‌ బ్యాడ్మంటన్‌

అందుకుతండా కబడ్డీ

వేములపల్లి బాల్‌బ్యాడ్మంటన్‌

నైన్‌పాక బాల్‌బ్యాడ్మంటన్‌

గంగారం కబడ్డీ

కాటారం అథ్లెటిక్స్‌

అంబేడ్కర్‌ స్టేడియం క్యారమ్స్‌, అథ్లెటిక్స్‌,

భూపాలపల్లి బాస్కెట్‌బాల్‌

జంగేడు వాలీబాల్‌

మంజూర్‌నగర్‌ తైక్వాండో

మున్సిపల్‌ గ్రౌండ్‌ కబడ్డీ, అథ్లెటిక్స్‌

భూపాలపల్లి

10 చోట్ల శిక్షణ శిబిరాలు

క్రీడాకారులకు అవకాశం

వేసవి దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాల్లో పిల్లలకు అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆటలు నిర్వహిస్తారు. ఇప్పటికే కోచ్‌ల నియామకం పూర్తిచేసి శిబిరాలను ప్రారంభించాం. శిక్షణ శిబిరాల్లో తాగునీరు, తదితర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవాలి.

సీహెచ్‌ రఘు, జిల్లా యువజన క్రీడల ఇన్‌చార్జ్‌ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement