మల్లూరుగుట్టపై మంటలు | - | Sakshi
Sakshi News home page

మల్లూరుగుట్టపై మంటలు

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

హేమాచలక్షేత్రంలో

రెండు రోజులుగా కార్చిచ్చు

కాలిబూడిదవుతున్న అటవీ సంపద

అగ్నికి ఆహుతవుతున్న వన్యప్రాణులు

మంగపేట: శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి కొలువైన మల్లూరుగుట్ట్ట అటవీ ప్రాంతం కాలిపోతోంది. రెండు రోజుల నుంచి గుట్టపై భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో గుట్టకు అతి సమీపంలోని కొత్తమల్లూరు, మల్లూరు గ్రామాల ప్రజలు మంటల వేడికి గురవుతున్నారు. మల్లూరు నుంచి చుంచుపల్లి, రమణక్కపేట, రాజుపేట వరకు 10 కిలోమీటర్ల పొడవున ఉన్న గుట్టల్లో వారం రోజుల నుంచి కార్చిచ్చుతో అడవులు దగ్ధమవుతున్నాయి. ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకు అతి సమీపంలోని అదే గుట్టకు మరో వైపున గల హేమాచల లక్ష్మీనర్సింస్వామి ఆలయ ప్రాంతం నుంచి శనిగకుంట, పూరేడుపల్లి, వాగొడ్డుగూడెం వరకు గుట్టను మంటలు చుట్టు ముట్టడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. సుమారు 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధికి మించి ఉన్న గుట్టపై గల లక్షలాది రూపాయల విలువైన సండ్ర, జిట్రేగు, నల్లమద్దితో పాటు తదితర విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతోంది.

వన్యప్రాణుల ప్రాణాలు గాల్లోకి..

హేమాచలక్షేత్రం సమీప అటవీ ప్రాంతంలో చింతామణి జలపాతం, దేవునికుంట, దబ్బతోగు, చుంచుపల్లి సమీపంలోని మామిడితోగు, రమణక్కపేట, ఎర్రమ్మతోగు తదితర తోగులతో పాటు పలు ప్రాంతాల్లో నీటి ఊటలు ఉన్నాయి. సంవత్సరం పొడవునా నీటి వసతి ఉండటంతో ఆయా అటవీ ప్రాంతాల్లో సంచరించే అడవి పందులు, కొండ గొర్రెలు, నక్కలు, తదితర జాతుల వన్యప్రాణులు అడవిలోని మంటల్లో చిక్కుకుని ఆహుతవుతున్నాయి. ఈ మంటల వేడికి తాళలేక ప్రాణాలు దక్కించుకునేందుకు అటవీ సమీప గ్రామాల్లోకి పలు రకాల జంతువులు వచ్చి వేటగాళ్లకు చిక్కి బలవుతున్నాయి.

హోర్డింగులు తప్ప చర్యలేవి?

వేసవికాలంలో అడవులు దగ్ధం కాకుండా ఉండేందుకు ఫైర్‌లైన్స్‌, కార్చిచ్చు కారణంగా ఏర్పడే మంటలను ఆర్పేందుకు ఎయిర్‌ మెషిన్‌ వంటి పరికరాలు వినియోగిస్తున్నారు. బేస్‌క్యాంప్‌ సిబ్బంది ఏర్పాటుతో పాటు అడవుల్లో నివసించే వన్య ప్రాణులను కాపాడేందుకు వివిధ రకాల చర్యల పేరుతో అటవీశాఖ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అడవికి నిప్పు మానవాళికి ముప్పు, అడవులను కాపాడుకుందాం అంటూ ఏజెన్సీలోని అభయారణ్యంలో అటవీశాఖ హోర్డింగులు ఏర్పాటు చేయడం తప్పా ఆచరణ మచ్చుకు కూడా కానరావడం లేదని వనప్రేమికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని జిల్లా సరిహద్దులోగల అటవిశాఖ చెక్‌పోస్టు నిర్వహణ అధికారులు, సిబ్బందితో పాటు దోమెడ, రాజుపేట, మల్లూరు సెక్షన్ల ఎఫ్‌ఎస్‌ఓ, బీట్‌ అధికారులు నిత్యం మండల కేంద్రంలోని రేంజ్‌ కార్యాలయానికి విధులపై వచ్చి వెళ్తుంటారు. వీరికి రాజుపేట మొదలుకుని మల్లూరు వరకు రోడ్డును ఆనుకుని ఉన్న గుట్ట అటవీప్రాంతం దగ్ధమవుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పా మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆయుర్వేద వృక్షసంపద కనుమరుగయ్యే

ప్రమాదం

ప్రపంచ ప్రాణకోటికి ప్రాణవాయువునిచ్చే సహజ సిద్ధ అడవులు దగ్ధం అవుతున్నాయి. అయినా అటవీశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడడం లేదు. అధికారుల తీరు చూస్తుంటే భవిష్యత్‌లో అడవులు అంతరించిపోయే పరిస్థితి కనిపిస్తుందని వనప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement