శాసీ్త్రయ పద్ధతిలో ఇసుకను తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ పద్ధతిలో ఇసుకను తొలగించాలి

Apr 26 2026 2:15 AM | Updated on Apr 26 2026 2:15 AM

భూపాలపల్లి: చెక్‌డ్యామ్‌లలో పేరుకుపోయిన ఇసుకను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. కలెక్టర్‌ అధ్యక్షతన మైనింగ్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్హర్‌ మండలంలోని వివిధ చెక్‌డ్యామ్‌లలోని ఇసుకను డీ–సిల్టింగ్‌ ద్వారా తొలగించే అంశాలపై చర్చించారు. వల్లంకుంట గ్రామం వద్ద అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యామ్‌, మల్లారం గ్రామంలోని చిన్న ఓదెల చెక్‌డ్యామ్‌, తాడిచెర్ల గ్రామంలోని గోపాల్‌పూర్‌, ఖమ్మంపల్లి చెక్‌డ్యామ్‌లలో ఇసుక తొలగింపుపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, మైనింగ్‌ ఏడీ జయరాజ్‌, టీజీఎండీసీ, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

అర్హులకు అక్రిడిటేషన్‌ కార్డులు..

అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్‌, జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ చైర్మన్‌ రాహుల్‌ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు కలెక్టర్‌ను కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 2026–2028 సంవత్సరాలకు చెల్లుబాటు అయ్యే అక్రిడిటేషన్‌ కార్డుల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మీడియా ప్రతినిధుల నుంచి 330 దరఖాస్తులు అందాయని అన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, డీపీఆర్వో శీలం శ్రీనివాస్‌, అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు క్యాతం సతీష్‌, మంతెన సమ్మయ్య, ఎర్రం సతీష్‌, మోబిన్‌ అహ్మద్‌, సారేశ్వరరావు, మధు పాల్గొన్నారు.

పనులు వేగవంతం చేయాలి..

వైద్య కళాశాల, వైద్య విద్యార్థుల వసతి భవనం (హాస్టల్‌) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో లేవని, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నప్పటికీ పనులు ఆలస్యమవడం సరికాదన్నారు.

జనగణనకు చర్యలు..

జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. జనగణన కార్యక్రమంలో భాగంగా మొదటి దశ అయిన గృహ లెక్కింపు, గృహ వసతి గణన వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించబడతుందని తెలిపారు. ఈ ప్రక్రియకు ముందుగా ప్రజలకు సౌలభ్యం కల్పించేందుకు స్వీయ లెక్కింపు (సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌) సదుపాయాన్ని వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఈ నెల 26వ తేదీ నుంచి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ గృహ, కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

అర్హులైన జర్నలిస్టులకు

అక్రిడిటేషన్‌ కార్డులు

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

Advertisement
 
Advertisement
Advertisement