బస్సు పయ్య కదల్లె.. | - | Sakshi
Sakshi News home page

బస్సు పయ్య కదల్లె..

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

3వ రోజు కొనసాగిన

ఆర్టీసీ కార్మికుల సమ్మె

డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఆర్టీసీ కార్మికులు

భూపాలపల్లి: హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మూడో రోజు శుక్రవారం సంపూర్ణంగా సక్సెస్‌ అయింది. భూపాలపల్లి డిపో నుంచి సంస్థ బస్సులు ఒక్కటి కూడా బయటకు రాలేదు. అద్దె బస్సుల డ్రైవర్లు సైతం సమ్మెకు మద్దతు పలికి తమ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులను నడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో భూపాలపల్లి డిపోలో సమ్మె సక్సెస్‌ అయింది. సమ్మెలో భాగంగా జేఏసీ నాయకులు, కార్మికులు పలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం డిపో ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించగా, మధ్యాహ్నం డిపో నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మౌన ప్రదర్శన చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేశారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. గురువారం ప్రైవేట్‌ బస్సులు నడిపించడంతో శుక్రవారం కూడా ప్రయాణికులు అంబేడ్కర్‌ చౌరస్తా, బస్టాండ్‌లో బస్సులు కోసం వేచి చూసి చివరకు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు.

ధరలు పెంచి ప్రయాణికుల తరలింపు..

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా శుక్రవారం సంస్థ, అద్దె బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆటోలు, టాక్సీల యజమానులు తమ ధరలను పెంచి ప్రయాణికులను తరలించారు. గతంలో భూపాలపల్లి–కాటారం, భూపాలపల్లి–పరకాలకు బస్సు టికెట్‌ ధర రూ.70 ఉండగా, శుక్రవారం ఆటోలు, టాక్సీ వాహనాల యజమానులు ఒక్కొక్కరికి రూ.100 తీసుకున్నారు. బస్సులు లేకపోవడంతో చేసేది లేక అదనపు భారాన్ని భరించి ప్రయాణాలు కొనసాగించారు.

శంకర్‌గౌడ్‌కు నివాళులు..

నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌కు భూపాలపల్లి డిపో కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. రాత్రి 8 గంటలకు డిపో ఎదుట శంకర్‌గౌడ్‌ చిత్ర పటాన్ని ఏర్పాటు చేసి నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

సమ్మెకు పలు సంఘాల మద్దతు..

కార్మికుల సమ్మెకు పలు రాజకీయ పార్టీల నాయకులు, సంఘాలు మద్దతు తెలిపాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి డిపో వద్దకు వచ్చి ఆర్టీసీ కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు ఎస్‌పీకే సాగర్‌, వివిధ సంఘాల నాయకులు సమ్మెకు మద్దతు తెలిపి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కార్మికులు బుర్రి తిరుపతి, సందీప్‌, కొమురన్న, రాజయ్య, శ్రీనివాస్‌, రాధాకృష్ణ, ఎన్‌ఆర్‌ నాయక్‌, సమ్మయ్య, ఎల్లాగౌడ్‌, బేగం, సునిత, అరుణ, రవీందర్‌, సుమలత తదితరులు పాల్గొన్నారు.

డిపోకే పరిమితమైన సంస్థ బస్సులు

మద్దతు తెలిపిన అద్దె బస్సుల డ్రైవర్లు

కొనసాగిన కార్మికుల

నిరసన కార్యక్రమాలు

Advertisement
 
Advertisement
Advertisement