పల్లెల్లో సందడి | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో సందడి

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

టికెట్ల కోసం

ఆశావహుల సందడి..

వచ్చే నెలలో పరిషత్‌ ఎన్నికలు?

భూపాలపల్లి రూరల్‌: స్థానిక పరిషత్‌ ఎన్నికల నగారా మోగనుందనే సంకేతాలతో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. త్వరలో రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్న నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే ఓటర్లను, పార్టీల నాయకులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

వచ్చే నెలలో ఎన్నికలు?

స్థానిక సంస్థల పరిషత్‌ ఎన్నికలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది. యంత్రాంగం ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లాలోని 109 ఎంపీటీసీ, 12 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ముందుగానే రంగంలోకి..

ఎన్నికల తేదీ ఖరారు కానప్పటికీ ఆశావహులు ముందుగానే రంగంలోకి దిగారు. ఇప్పటి నుంచే ప్రజల్లో తమ పోటీ గురించి చర్చ ప్రారంభించి ఎన్నికల తేదీ వచ్చే నాటికి తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తే ఎంత ఖర్చయినా వెనకాడబోమని చెబుతున్నారు.

అధికారంపై ధీమాతో

కాంగ్రెస్‌..

జిల్లాలో సర్పంచ్‌ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని అన్ని సీట్లలో తామే జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్‌ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో తమకు విజయం దక్కుతుందని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రజావ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందన్న ఆశలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఉన్నాయి.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని పార్టీల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. వాస్తవానికి గతేడాది నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీచేసి ఓడిపోయిన వారితో పాటు, సర్పంచ్‌ ఎన్నికల్లో ఎంపీటీసీ సీట్లు ఇస్తామని ఆశపెట్టి పోటీలనుంచి తప్పించిన నాయకులు, కొత్తగా యువ నాయకులు టికెట్లు ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌లో కూడా టికెట్‌ కోసం పోటీ పెరుగుతోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ తరఫున ఎన్నికల ఖర్చు కోసం ఫండ్‌ భారీగానే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీలో టికెట్‌ కోసం పోటీ అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. బీజేపీ కూడా గ్రామాల్లో తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడంతో ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు టికెట్‌ ఆశిస్తున్నారు.

గ్రామాల్లో జోరందుకున్న

రాజకీయ చర్చలు

ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement