భూపాలపల్లి అర్బన్: భక్తుల సౌకర్యార్థం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి నిర్ణీత గడువులోపు పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, వైద్య, పీఆర్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, ప్రణాళిక, రవాణా, పర్యాటక, అగ్నిమాపక శాఖల అధికారులు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించారు. ప్రత్యేకంగా కాళేశ్వరం సరస్వతి ఘాట్ వద్ద జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘాట్ నిర్మాణం, షట్టరింగ్, స్టాంప్డ్ కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయని, వీటిని మరింత వేగవంతం చేయాలని సూచించారు. పేవర్ బ్లాక్స్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పుష్కరాల సందర్భంగా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, రవాణా వంటి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో నిర్వహించాలని, భక్తుల కోసం స్నానాల షవర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయ లక్ష్మి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్య జాగ్రత్తలు అవసరం
చార్ధామ్ యాత్రకు వెళ్లే యాత్రికులు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రాల్లో తక్కువ ఆక్సిజన్, తీవ్ర చలి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. యాత్రకు ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. యాత్ర సమయంలో వెచ్చని దుస్తులు, అవసరమైన మందులు వెంట తీసుకెళ్లాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 104 హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని కోరారు.
విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవాలి
మల్హర్(కాటారం): విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదల, క్రమశిక్షణతో చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. గురువారం కాటారం మండలం మేడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో నాలుగో రోజు జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రగతి నివేదికలను అందజేశారు. అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సంక్షేమ వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువుకు పేదరికం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు కాదని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లితండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీటీడబ్ల్యూఓ నాగసాగర్, ఎంపీడీఓ బాబు, సర్పంచ్ పవిత్ర, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


