బయటకు రాని ఆర్టీసీ బస్సులు
భూపాలపల్లి: తమ హక్కుల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు సక్సెస్ అయింది. అద్దె బస్సులు మినహా సంస్థ బస్సులు డిపో నుంచి బయటకు రాలేదు. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకే ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు భూపాలపల్లి డిపో కార్యాలయానికి చేరుకొని మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. అప్పటి నుంచి డిపో ఎదుట, బస్టాండ్ సమీపంలోనే ఉంటూ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా చూసుకుంటూ ఉన్నారు. ఉదయం 11 గంటల సమయంలో పోలీసు వ్యాన్‌లో అవుట్‌సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లను డిపోలోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నించారు. కార్మికులు గమనించి పోలీసు వ్యాన్‌ను అడ్డుకొని వాహనం ఎదురుగా బైఠాయించి అడ్డుకున్నారు. కార్మికుల పరిస్థితిని జేఏసీ నాయకుడు బుర్రి తిరుపతి ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి వివరించి విధులకు వెళ్లవద్దని ప్రాధేయపడ్డాడు. దీంతో వారు సైతం వెనుదిరిగారు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలుసుకున్న భూపాలపల్లి డిపో డ్రైవర్ వీఎంఎం చారి భావోద్వేగానికి లోనై, కార్మికుల హక్కుల సాధన కోసం తాను సైతం బలిదానం అవుతానంటూ వ్యాఖ్యలు చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు, కార్మికులు వెంటనే అతడి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నందున సంస్థ బస్సులు ఒక్కటి కూడా డిపో నుంచి బయటకు రాలేదు. డిపోకు చెందిన 22 అద్దె బస్సులు మాత్రం వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తరలించాయి. కొంతమంది అద్దె బస్సుల యజమానులైతే బుధవారం రాత్రే తమ బస్సులను ఇంటికి తీసెకెళ్లి, పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, మంజూర్‌నగర్ తదితర సెంటర్ల నుంచి బస్సులను నడిపించారు. సమ్మెలో భాగంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్మికులు బుర్రి తిరుపతి, రాజయ్య, కొమురన్న, బండి శ్రీనివాస్, సందీప్, రాధాకృష్ణ, ఎన్‌ఆర్ నాయక్, సమ్మయ్య, బేగం, సునిత, అరుణ, సుమలత పాల్గొన్నారు.
ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో
నడిపించేందుకు యత్నం
అడ్డుకున్న కార్మికులు


