నేడు ఉమ్మడి జిల్లా బంద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మడి జిల్లా బంద్‌

Apr 24 2026 10:40 AM | Updated on Apr 24 2026 10:40 AM

నేడు ఉమ్మడి జిల్లా బంద్‌

ఆర్టీసీ జేఏసీ పిలుపు

హన్మకొండ: నర్సంపేట డిపో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ పెట్రోల్‌ పోసుకోవడాన్ని నిరసిస్తూ, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతూ నేడు (శుక్రవారం) ఉమ్మడి వరంగల్‌ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం రాత్రి హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ జేఏసీ వరంగల్‌ రీజియన్‌ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ వైఖరి మూలంగానే డ్రైవర్‌ శంకర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు జేఏసీ తెలిపింది. జేఏసీ వరంగల్‌ రీజియన్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి జిల్లాలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, అన్ని వర్గాలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ డిపోల వద్ద

అంబులెన్స్‌లు

శంకర్‌గౌడ్‌ ఘటన నేపథ్యంలో

అప్రమత్తమైన ప్రభుత్వం

హన్మకొండ:వరంగల్‌ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం రాత్రి అంబులెన్స్‌లు డిపోల వద్దకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య ఆదేశాల మేరకు అంబులెన్స్‌లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు 108 సిబ్బంది తెలిపారు.

కోర్టు ఆవరణలో

చలివేంద్రం ఏర్పాటు

భూపాలపల్లి అర్బన్‌: ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా కోర్టు, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ప్రాంగణంలో గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ఆర్‌ దిలీప్‌ కుమార్‌ నాయక్‌ ప్రారంభించారు. బార్‌ అసోసియేషన్‌, న్యాయవాది భూక్యా రమేష్‌ నాయక్‌, తిరుమల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ద్వారా కోర్టుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యమని జడ్జి తెలిపారు. చలివేంద్రం ఏర్పాటుకు సొంత ఖర్చులతో సహకరించిన న్యాయవాది భూక్యా రమేష్‌నాయక్‌, తిరుమలను జడ్జి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూనూరు సురేష్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు గంగరబోయిన రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి ఆకు ల రాములు, లేడీ జాయింట్‌ సెక్రటరీ కంప అక్షయ, లైబ్రరీ కార్యదర్శి ఆకినేపల్లి రవికుమార్‌, ట్రెజరర్‌ ఇందరపు శివకుమార్‌, స్పోర్ట్స్‌ సెక్రటరీ నాగరాజ్‌, ఈసీ సభ్యులు రాయం రమేష్‌, వసంత, అర్ధకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement