భూపాలపల్లి: ఎండలు మండుతుంటే మనుషులకే కాదు.. మూగజీవాలకు కూడా చిర్రెత్తుకొస్తుంది. వేసవి సెగకు రోజురోజుకు జిల్లాలో నమోదవుతున్న కుక్కల దాడులు కలకలం రేపుతున్నాయి. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వెయ్యికి పైగా కుక్కకాటు కేసులు నమోదు కావడం గమనార్హం. వేసవి తీవ్రత పెరిగే కొద్దీ ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
ఎక్కడ చూసినా శునకాల స్వైరవిహారం..
జిల్లా కేంద్రమైన భూపాలపల్లి మున్సిపాలిటీతో పాటు, మండల కేంద్రాలు, గ్రామాల ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసినా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు రోడ్డెక్కితే చాలు.. దాడులకు పాల్పడుతూ కండలు పీకుతున్నాయి. జి ల్లాలోని పలు కూడళ్ల వద్ద కుక్కలు కాపు కాస్తూ వాహనదారులను వెంబడిస్తున్నాయి. దీంతో వా హనదారులు భయాందోళనకు గురై అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీలు అనే తేడా లేకుండా ఎక్కడప డితే అక్కడ కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి.
4 నెలల్లో 1,222 కేసులు నమోదు
ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ వరకు 1,222 కుక్క కాటు కేసులు నమోదు అయినట్లుగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రతీ నెల పదుల సంఖ్యలో కుక్క కాటుకు గురై ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారు సైతం ఉన్నారు.
దాడులకు గల కారణాలివే..
వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో కుక్కలు తీవ్రమైన హీట్ స్ట్రెస్‌కు లోనవుతాయి. దీంతో వాటి ప్రవర్తనలో మార్పులు వచ్చి స్వల్ప కారణాలకే ఆగ్రహానికి గురవుతున్నాయి. అంతేకాక ఈ వేసవిలో వీధి కుక్కలకు తాగునీరు, ఆహారం లభించలేదు. దీంతో అసహనానికి గురై దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కుక్కలే కాకుండా కోతుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.
చిన్నారులు, వృద్ధులపైనే దాడులు
4 నెలల్లో వెయ్యికి పైగా కేసుల నమోదు
నియంత్రించడంలో
అధికారులు విఫలం


