మొగుళ్లపల్లి: పోషణలోపం లేని సమాజాన్ని నిర్మించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి అన్నారు. మండలంలోని ఇప్పలపల్లి అంగన్‌వాడీ పాఠశాలలో బుధవారం పోషణ పక్వడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ అంగన్‌వాడీ టీచర్ తన పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, పాలు వంటివి తీసుకోవడం ద్వారా లభించే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మన శరీర రక్షణకు ముఖ్యమైనవని వీటి గురించి సమాజంలో అవగాహన పెంచి, ‘పోషణలోపం లేని సమాజం’ నిర్మించడానికి అందరం కృషి చేయాలన్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మిషన్ కో ఆర్డినటర్ కృష్ణ మాట్లాడుతూ హెల్ప్ లైన్ నంబర్‌లు, సఖి అందించే సేవలు, ప్రతి అంగన్‌వాడీలో ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేతిపల్లి శీరిష, సంక్షేమ శాఖ మహిళ సాధికారత సిబ్బంది అనూష, మమత, సురేష్, అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు పాల్గొన్నారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ
అధికారి మల్లేశ్వరి


