నిప్పుల కుంపటి | - | Sakshi
Sakshi News home page

నిప్పుల కుంపటి

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

నిప్పుల కుంపటి

న్యూస్‌రీల్‌

భూపాలపల్లి, తాడిచర్లలో..

పనివేళలు మార్చాలి..

బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

ఉక్కిరిబిక్కిరవుతున్న సింగరేణి కార్మికులు

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి కాలరీస్‌ భూపాలపల్లి ఏరియాలో ఉష్ణోగ్రతలు నిప్పులకుంపటిని తలపిస్తున్నాయి. ఉదయం 9గంటల నుంచి మొదలు సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత తగ్గకపోవడంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలోనే మే నెలను తలపించేలా ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కన్నా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వడగాలులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ఉదయం 9 గంటలు దాటితే చాలు బయట తిరగడం కష్టంగా మారుతోంది. సింగరేణి బొగ్గు గనులు, థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, పరిశ్రమలతో విలసిల్లుతున్న భూపాలపల్లి, తాడిచర్ల ప్రాంతంలో ఎండలు మరింత భగభగమంటున్నాయి.

గనులపై మరింత ప్రభావం..

ఉపరితల గనుల్లో బొగ్గును వెలికితీయడానికి నిత్యం టన్నుల కొద్ది పేలుడు పదార్థాలు వినియోగిస్తుంటారు. బొగ్గు పొరలపై ఉన్న మట్టి, బండరాళ్లను తొలగించడానికి భారీ పేలుళ్లు జరపాల్సి ఉంటుంది. బొగ్గును వెలికితీయడానికి అవే పేలుడు పదార్థాలను వినియోగిస్తుంటారు. ఫలితంగా కర్బన ఉద్గారాలు, రాతి ఒక్కసారిగా గాలిలో కలుస్తాయి. ఈ దుమ్ము రేణువులు ఉష్ణోగ్రతలను సులభంగా గ్రహించడంతో గాలి వేడెక్కి ఎండ తీవ్రత సాధారణం కంటే అత్యధికం అవుతుంది. గనుల ప్రాంతంలో పెద్దఎత్తున నిల్వచేసే బొగ్గు మరింత వేడెక్కడంతో దాని ప్రభావం వాతావరణంపై పడి ఈ ప్రాంతాన్ని నిప్పులకొలిమిలా మార్చుతుంది.

ఉపశమనానికి ప్రత్యేక చర్యలు

ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను యాజమాన్యం నిలిపివేసే అవకాశం ఉంది. వేసవిలో పెరిగిన ఎండలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులకు వడదెబ్బ తగలకుండా అనేక చర్యలు తీసుకుంటుంది. చలువ పందిళ్లు వేయించి స్ప్రింక్లర్లతో నీటిని చల్లడం వంటి చర్యలు చేపడుతుంది. ప్రతీ 40 మీటర్ల లోతుకు ఒక డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరుగుతుంది. సింగరేణిలో ఉపరితల గనులు 60–160 మీటర్ల లోతులో ఉన్నాయి. ఇక్కడ సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీంతో కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు అందించడం వంటి చర్యలకు యాజమాన్యం ఉపక్రమిస్తోంది.

మరిన్ని సౌకర్యాలు అవసరం

యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల కోసం క్షేత్రస్థాయిలో వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. మధ్యాహ్నం 12గంటల నుంచి 4గంటల మధ్య పనివేళల్లో ఉపశమనం కలిగించేలా షిప్టులను సర్దుబాటు చేస్తే మంచిది. గనిదారుల్లో నిరంతరం నీటిని స్ప్రే చేయించడం, భారీ యంత్రాల క్యాబిన్లలో ఎయిర్‌ కండీషనింగ్‌ వ్యవస్థ మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ప్రస్తుత ఓపెన్‌కాస్టుల్లో కార్మికులకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఇవ్వకుండా కేవలం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. రెస్ట్‌ షెల్టర్ల సంఖ్య పెంచాలి. ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పా టు చేయాలని, వడదెబ్బ నుంచి కాపాడుకునేలా అవగాహన కల్పించాలని కార్మికులు విన్నవిస్తున్నారు.

భూపాలపల్లి ఏరియాలో కేటీకే ఓపెన్‌కాస్టు ప్రాజెక్ట్‌–2, 3, తాడిచర్ల ఓపెన్‌ కాస్టు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మూడు ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో సుమారు 3వేల మంది కార్మికులు మూడు షిష్టుల్లో కలిపి విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటి, రెండో షిఫ్టులలో విధులకు హాజరయ్యే కార్మికులు ఎక్కువ సమయం ఎండలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ ఎండల తీవ్రత ఇతర ప్రాంతాల కన్నా ఎక్కువగా ఉంటోంది. ఓపెన్‌ గనుల్లో బొగ్గు, మట్టి, బండ రాళ్లు, దుమ్ముతో పాటు గని లోతుకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గనుల్లో కార్మికులు ఎండ తీవ్రతకు విలవిలలాడుతున్నారు.

భూపాలపల్లి, తాడిచర్లలో ఎండల తీవ్రత

40–42 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉక్కపోత

అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్మికుల సంక్షేమం రీత్యా పనివేళలు మార్చాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు పనులు నిలిపివేసి మిగిలిన సమయాల్లో పనులు కొనసాగించేలా యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేయాలి. గతంలో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

– నల్లవెల్లి సదానందం, ఓపెన్‌ కాస్ట్‌ కార్మికుడు, టీబీజీకేఎస్‌ సెంట్రల్‌ కమిటీ

Advertisement
 
Advertisement
Advertisement