మొగుళ్లపల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం మొగుళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ ప్రాంగణ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘‘వన మహోత్సవం’’ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ సంపత్‌రావు, సీఐ మల్లేష్, ఎస్సై సురేష్ సిబ్బంది ఉన్నారు.


