నేడు ముఖ్యమంత్రి కాళేశ్వరం టూర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు ముఖ్యమంత్రి కాళేశ్వరం టూర్‌

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

మేడిగడ్డలో జియో ఫిజికల్‌, టెక్నికల్‌ పరీక్షల పరిశీలన..

భూపాలపల్లి/కాళేశ్వరం: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం పర్యటనకు సోమవారం (నేడు) రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం హెలిపాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానం చేరుకుని ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత కాళేశ్వరం దేవస్థానంలోని తూర్పు ఈశాన్య స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. కాళేశ్వరాలయం గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

మూడు చోట్ల హెలిపాడ్‌ల ఏర్పాటు..

సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం దేవస్థానం, మేడిగడ్డ, నస్తుర్‌పల్లిలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు చోట్ల హెలిపాడ్‌లు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానంలో పూలతో డెకెరేషన్స్‌ చేశారు. పూజా కార్యక్రమాలు, భూమిపూజ కోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డలో సమీక్ష నిర్వహిస్తుడండంతో అంబట్‌పల్లిలోని గెస్ట్‌హౌస్‌లో ఏర్పాట్లు చేశారు. నస్తుర్‌పల్లిలో సుమారు 40 ఎకరాల్లో సభాప్రాంగణం, విద్యుత్‌ లైట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్‌ స్థలాలు, హెలిపాడ్‌ సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్‌, అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మీ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు జిల్లా అధికారుల పనులు పూర్తి చేశారు.

జనసమీకరణ..

కాటారం సబ్‌డివిజన్‌తో పాటు పక్క జిల్లాల నుంచి భారీ ఎత్తున సభకు ప్రజలు, రైతులు తరలి రావడానికి నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు సమకూర్చనున్నారు. భారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సర్పంచ్‌లు, మాజీ ప్రజా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరకాల నుంచి మహదేవపూర్‌ వరకు ఉన్న ఎన్‌హెచ్‌ 353–సీ రహదారిపై బొగ్గు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సీఐ నరేష్‌శ్‌మార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రహదారి ఇరువైపులా వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంజూర్‌నగర్‌ నుంచి బాంబులగడ్డ వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయి కాటారం వైపు ప్రయాణించనున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఆదిముక్తీశ్వరాలయంలోనే పూజలు

కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో రూ.200కోట్లతో రాతి నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం(నేడు) భూమి పూజ చేపట్టనున్నారు. వచ్చే నెల మే 21 నుంచి జూన్‌ 1 వరకు సరస్వతినది అంత్యపుష్కరాలు జరుగనున్నాయి. 1978 నుంచి 82 వరకు జీర్ణోద్ధరణ సమయంలో సిమెంట్‌తో నిర్మించిన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ప్రధాన గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాలు తొలగించి రాతితో నిర్మాణం చేయనున్నారు. దీంతో ఆలయంలో నిత్య పూజలు, ఒక కిలోమీటర్‌ దూరంలో అడవిలో ఉన్న ఆదిముక్తీశ్వరాలయంలో పూజలు నిర్వహించడానికి దేవా దాయ శాఖ సర్వంసిద్ధం చేస్తుంది.

కాళేశ్వరాలయంలో అధికారుల పరిశీలన

కాళేశ్వరం ఆలయ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈనేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్‌, ఐఎస్‌డబ్ల్యూ అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు.

రూ.200 కోట్లతో కాళేశ్వరాలయం రాతి నిర్మాణ పనులకు భూమి పూజ

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శన

కాటారం మండలం నస్తుర్‌పల్లిలో రైతు భరోసా నిధుల విడుదల

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

2023 అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్‌లో 19, 20వ పియర్‌లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ లీకేజీలు ఏర్పాడ్డాయి. అప్పటి నుంచి ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యాంసేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని ప్రజలకు అందించడానికి ముందుకు రావడంతో సీఎం పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో 3.45 గంటలకు హెలికాప్టర్‌లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న జియో ఫిజికల్‌, జియో టెక్నికల్‌ పరీక్షలు, బోర్‌హోల్స్‌ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వార నస్తుర్‌పల్లికి చేరుకుంటారు. 6.30 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల అనంతరం రోడ్డు మార్గం ద్వార వెళ్తారని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement