నేటి నుంచి ఓపెన్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఓపెన్‌ పరీక్షలు

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

22 నుంచి సమ్మెకు సిద్ధం

భూపాలపల్లి అర్బన్‌: ఓపెన్‌ ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాజేందర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెన్త్‌ పరీక్షలకు 428 మంది, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 670 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. భూపాలపల్లి, కాటారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జంగేడు, భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్మీడియట్‌, సింగరేణి ఉన్నత పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాల, కాటారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టెన్త్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు.

నేటి ప్రజావాణి,

ప్రజాదివస్‌ రద్దు

భూపాలపల్లి రూరల్‌: నేడు (సోమవారం) కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి, ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదివస్‌ను రద్దుచేస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్‌ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

భూపాలపల్లి డిపోలో జేఏసీ ఏర్పాటు

భూపాలపల్లి అర్బన్‌: టీజీఎస్‌ ఆర్టీసీ భూపాలపల్లి డిపోలో కార్మిక సంఘాలన్నీ ఏకమై ఐక్య కార్యచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసుకున్నాయి. డిపోలోని అన్ని యూనియన్ల ప్రతినిధులు కలిసి నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఆర్టీసీ జేఏసీ చీఫ్‌ అడ్వైజర్‌గా ఎం.రవీందర్‌, చైర్మన్‌గా బుర్రి తిరుపతి, కన్వీనర్‌గా బండి శ్రీనివాస్‌, కో–కన్వీనర్‌గా డి.రాజయ్య, వైస్‌ చైర్మన్‌గా వి.రవి, ట్రెజరర్‌గా బి.సతీష్‌లను ఎంపిక చేశారు. ఈ నెల 22నుంచి జరిగే ఆర్టీసీ సమ్మె వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.

అద్దె బస్సుల స్కీం కొనసాగించాలి

హన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల స్కీం కొనసాగించాలని ఆర్టీసీ హైర్‌ బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్‌ కోరారు. హనుమకొండ హంటర్‌రోడ్డులోని అభిరాం గార్డెన్స్‌లో ఆర్టీసీ హైర్‌బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వరంగల్‌ రీజియన్‌స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో లక్కం ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతూ ఉపాధి పొందుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీలకు అనుసంధానంగా 0.033 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ బస్సులను నడుపుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలుష్యం నివారణ పేరుతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెడితే సరిపోదని, ఇతర వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్టీసీ హైర్‌బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్‌రెడ్డి మాట్లాడుతూ 2007, 2009 బస్సుల స్థానంలో రిప్లేస్‌మెంట్‌ బస్సులను ఇవ్వాలని, డిపో మేనేజర్లతో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్‌ఎం కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. హైర్‌బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వరంగల్‌ రీజియన్‌ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, అసోసియేషన్‌ ప్రతినిధులు బాలవర్ధన్‌రెడ్డి, ఎన్‌.ప్రసాద్‌, హబీబ్‌, జె.వెంకట్‌రెడ్డి, కె.సదానందం, ఎండి పర్వేజ్‌, జి.వెంకన్న, కె.భాస్కర్‌రెడ్డి, కుమార్‌, బి.రామలింగారెడ్డి పాల్గొన్నారు.

నయీంనగర్‌: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్‌ ఆవరణలోని వరంగల్‌–1 డిపో ఎదుట రీజియన్‌ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్‌ ఈదురు వెంకన్న, వైస్‌ చైర్మన్‌ థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement