కోఆప్షన్‌ దక్కేదెవరికో? | - | Sakshi
Sakshi News home page

కోఆప్షన్‌ దక్కేదెవరికో?

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

భూపాలపల్లి: జిల్లాలోని ఏకైక భూపాలపల్లి మున్సి పాలిటీలో కోఆప్షన్‌ సందడి మొదలైంది. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ కౌన్సిలర్‌ స్థానాలను కై వసం చేసుకోవడంతో నాలు గు కోఆప్షన్‌ స్థానాలు ఆ పార్టీకే దక్కనున్నాయి. దీంతో ఆ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది.

పది మందికి పైగా ఆశావహులు..

భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డు స్థానాలు ఉండగా నలుగురు కోఆప్షన్‌ సభ్యులను నియమిస్తారు. అయితే ఇందులో ఇద్దరు మైనార్టీలు (ఒక మహిళ, ఒక పురుషుడు), మిగిలిన రెండింటిలో ఒకరు మాజీ ప్రజాప్రతినిధి, మరొకరు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్న వారిని నియమిస్తారు. నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండాలనే నిబంధన ఉంది. అంతేకాక మున్సిపాలిటీలో ఓటరుగా ఉండి, 21 ఏళ్లు దాటిన వారై ఉండాలి. ఈ రిజర్వేషన్ల లెక్కలు తేలడంతో, ఆయా వర్గాలకు చెందిన నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండటంతో, ఈ పదవులను దక్కించుకుంటే స్థానికంగా పట్టు సాధించవచ్చని ఆశావహులు భావిస్తున్నారు. మైనార్టీ విభాగం నుంచి హఫీజ్‌, ఫాస్టర్‌ రాజ్‌కుమార్‌, మాజీ ప్రజాప్రతినిధుల విభాగం నుంచి తాటి హైమావతి, శిరుప అనిల్‌, ముంజాల రవీందర్‌, సజ్జనపు స్వామి, చల్ల రేణుక, దాట్ల శ్రీనివాస్‌తో పాటు మరో కొంతమంది కోఆప్షన్‌ పదవులను ఆశిస్తున్నారు.

ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ

కోఆప్షన్‌ పదవుల భర్తీ కోసం మున్సిపల్‌ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. కాగా శనివారం సాయంత్రం వరకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు.

‘సత్తన్న’ మదిలో ఉన్నదెవరో?

కోఆప్షన్‌ సభ్యుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్ణయమే అత్యంత కీలకం. దీంతో ఆశావహులు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కష్టకాలంలో సైతం వెన్నంటి ఉన్నామని, తమకు అవకాశం ఇ వ్వాలని పలువురు ఆశావహులు ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఈ నెల 20న రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నందున, సీఎం సభ అనంతరం కోఆప్షన్‌ సభ్యుల ఎంపికపై ఎ మ్మెల్యే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

మున్సిపాలిటీలో

నాలుగు పదవులు

అధికార పార్టీలో నెలకొన్న తీవ్ర పోటీ

ఎమ్మెల్యే చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

ఒక్క చాన్స్‌ ప్లీజ్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన, రిజర్వేషన్ల మార్పుతో పోటీ చేసే అవకాశం కోల్పోయిన, ఎమ్మెల్యే సూచనల మేరకు బరిలో నిలవని వారు.. అధికార కాంగ్రెస్‌ పార్టీలో చాలా మంది ఉన్నారు. వీరంతా కౌన్సిల్‌లో అడుగుపెట్టి తమ గళాన్ని వినిపించాలని తహతహలాడుతున్నారు. ఈ కోఆప్షన్‌ పదవులను మాజీ కౌన్సిలర్లు ఒక ‘లైఫ్‌ లైన్‌’లా భావిస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరమైన కొందరు సీనియర్లు కూడా ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement