మల్హర్(కాటారం): మండలంలోని కాటారం సన్తూర్‌పల్లిలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ ఏర్పాట్లను శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం, హెలిపాడ్, పార్కింగ్ ప్రాంతాలు, సభావేదికను సమగ్రంగా తనిఖీ చేశారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, స్టేజ్ స్థితిగతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అదనపు స్థలాన్ని చదును చేసి వాహనాల నిలుపుదల సౌకర్యాన్ని విస్తరించాలని సూచించారు. హెలిపాడ్ ప్రదేశంలో దుమ్ము ఎగరకుండా నీరు చల్లడంతో పాటు స్థలాన్ని సమంగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు.


