దవాఖానాలో దాహార్తి | - | Sakshi
Sakshi News home page

దవాఖానాలో దాహార్తి

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

దవాఖానాలో దాహార్తి

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో తాగునీటికి కటకట

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో తాగునీటి కటకటాలు తప్పడం లేదు. ప్రతి రోజు ఆస్పత్రిలో 500నుంచి 700వరకు ఓపీ, 50నుంచి 100 వరకు ఇన్‌ పేషెంట్లు వస్తుంటారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేని తనం మూలంగా ఆస్పత్రికి వచ్చే బాలింతలు, గర్భిణులు, పేషెంట్లు, అటెండెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం కావడంతో దాహార్తిని తట్టుకోలేకపోతున్నారు. ఆస్పత్రిలో తాగునీటి ఇబ్బందులపై శుక్రవారం సాక్షి పరిశీలన చేపట్టింది.

రెండు బోర్లు అంతంత మాత్రమే..

ఆస్పత్రిలో ఏడాది కాలంగా రెండు బోర్లు అంతంత మాత్రమే పని చేస్తున్నాయి. ఆస్పత్రిలో మొత్తం ఐదు బోర్లు ఉండగా అందులో మూడు బోర్లు పనిచేయడం లేదు. వేసవికాలం సమీపిస్తున్నా తాగునీటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందస్తుగా ఆస్పత్రి అధికారులు ఉన్నతాధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లిన పాపాన పోలేదు. వినియోగంలో ఉన్న రెండు బోర్లతోనే వెళ్లదీస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని నిరంతరాయంగా సరఫరా చేయకపోతే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి.

అలంకారప్రాయంగా ఆర్‌ఓ ప్లాంట్‌

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఆర్‌ఓ ప్లాంట్‌ అలంకార ప్రాయంగా మారింది. ఆస్పత్రికి వచ్చే రోగులు, అంటెండెంట్లకు సురక్షితమైన తాగునీటిని అందించాలని కలెక్టర్‌ ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ప్లాంట్‌కు సంబందించిన కెమికల్స్‌, మినరల్స్‌ కలపకుండానే నేరుగా కలుషితమైన వాటర్‌ ట్యాంక్‌ నుంచి ట్యాప్‌ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆస్పతికి స్వచ్ఛంద సంస్థ అందజేసిన వాటర్‌ ఫ్రిజ్‌ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. తాగునీరు పట్టుకునే ట్యాప్‌ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. ఓపీ పేషెంట్లు నీళ్లు తాగడానికి కనీసం గ్లాసులు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఆస్పత్రి అధికారులు ఉన్నారని రోగులు మండిపడు తున్నారు.

ఏడాదిగా పనిచేయని మూడు బోర్లు

నిరుపయోగంగా ఆర్వో ప్లాంటు

ఇబ్బందులు పడుతున్న

రోగులు, అటెండెంట్లు

దుకాణాల్లో నీరు కొనుగోలు చేస్తున్న పరిస్థితి

పట్టించుకోని అధికారులు..

దృష్టిసారించని పాలకులు

Advertisement
 
Advertisement
Advertisement