కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల బృందం నేడు (శనివారం) ఉదయం 11గంటలకు సందర్శిస్తారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి మాజీ జెడ్పీచైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, నడిపల్లి దివాకర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ జెడ్పీచైర్‌పర్సన్ జ్యోతిలతో పాటు ముఖ్య నేతలు సందర్శిస్తారని పేర్కొన్నారు. దీంతో ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు మేడిగడ్డ సందర్శనకు రానున్న నేపథ్యంలో ముందుగానే బీఆర్‌ఎస్ బృందం రానుండడంపై రాజకీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సింగరేణికి బకాయిలు చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: విద్యుత్ సంస్థల నుంచి సింగరేణి సంస్థకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహరావు డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. కారుణ్య నియామకాల కింద ఇవ్వాల్సిన ఉద్యోగాలను విజిలెన్స్ పేరుతో ఆలస్యం చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పెర్క్స్‌పై ఆదాయ పన్ను మినహాయింపు, కార్మికుల సొంతింటి కల, మారుపేర్ల సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడమేనని స్పష్టంచేశారు. విద్యుత్ సంస్థలు తక్షణమే బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 28న సీఐటీయూ ఆధ్వర్యంలో ‘చలో విద్యుత్ సౌధ’ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు కంపేటి రాజయ్య శ్రీ కాంత్, బాబురావు, తోట రమేశ్ పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాదాలపై
అప్రమత్తంగా ఉండాలి
ములుగు రూరల్: ఆస్పత్రుల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి అన్నారు. శుక్రవారం ములుగు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిల్లో విద్యుత్ వైర్లు నాణ్యమైనవి వినియోగించాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను నిరంతరం పరిశీలించాలన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా, సమయోచితంగా స్పందించడం ముఖ్యమన్నారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌ను ఉపయోగించకుండా మెట్లమార్గంలో రావాలన్నారు. అనంతరం ప్రమాదాలు జరిగిన సమయంలో తక్షణ చర్యలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు.
సమ్మేళనానికి సర్వం సిద్ధం
ములుగు: జిల్లా కేంద్రంలో నేడు (శనివారం) నిర్వహించనున్న విరాట్ హిందూ మహాసమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ తెలిపారు. శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులు మహాసమ్మేళనం నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా సమ్మేళన కార్యక్రమం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందన్నారు. శ్రీ భువనేశ్వరి దేవి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామిజీ, ధర్మ జాగరణ అఖిల భారత సహ సంయోజక్ ఏలె శ్యాంకుమార్ జీ హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రతీఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని కమిటీ సభ్యులు అందజేసిన నవధాన్యాలను తీసుకువచ్చి యాగంలో సమర్పించి భారతమాతతో పాటు హిందూ దేవతామూర్తుల ఆశీర్వాదం పొందాలన్నారు.


