భూపాలపల్లి అర్బన్: మాలాధారణతో బుధవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపాల్ అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ కౌన్సిలర్లు, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. పోలీసులు రావడంతో తోపులాట చోటుచేసుకుంది. భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న ఓంకార్ బుధవారం మాలాధారణతో పాఠశాలకు రావడంతో ప్రిన్సిపాల్ జాన్సీరాణి అనుమతించలేదు. గురువారం ఉదయం పాఠశాల గేటు ఎదుట ధర్నా చేపట్టిన నాయకులు ప్రిన్సిపాల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ధర్నా కొనసాగడంతో విద్యార్థులకు అంతరాయం కలగడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. వారు వెనక్కి తగ్గకపోవడంతో కొందరు నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ వ్యాఖ్యలు కేవలం విద్యార్థిపై కాకుండా హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా ఉన్నాయని ఆరోపించారు.


