● మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య
భూపాలపల్లి రూరల్: ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ సూచించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక మండల స్థాయి సమావేశం జిల్లాకేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ నాగరాజు అధ్యక్షతన గురువారం జరిగింది. చైర్మన్ బుర్ర కొమురయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్పంచ్‌లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాలలో సర్పంచ్‌లకు పంచాయతీ కార్యదర్శులకు కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. వాటిని అధిగమిస్తూ గ్రామాల అభివృద్ధికి పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారి జవహర్‌లాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదికలోని ఐదు అంశాలను ప్రజలకు చేరే విధంగా అధికారులు సర్పంచ్‌లు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందిస్తూ నూతన వ్యవసాయ విధానాలు అమలుచేసే విధంగా వ్యవసాయ అధికారులకు సూచనలు చేశారు. యువత జిల్లాకేంద్రంలో సింగరేణి ఏర్పాటుచేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ పొందాలని, టాస్క్ ద్వారా ఉద్యోగ అవకాశాలు అందుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నూతనంగా జూనియర్ కళాశాలకు మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీలకు, ప్రభుత్వ పాఠశాలలకు అల్పాహారం వంటి నూతన పథకాలను అమలు చేసే విధంగా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ లక్ష్మి రాజయ్య, హౌసింగ్ పీడీ లోకిలాల్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రవీందర్, ఎస్సై గీతా రాథోడ్, భూపాలపల్లి మండలంలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.


